డీకే కుమార్తెకూ సీబీఐ తాఖీదులు

తనకు ఈడీ, తన కుమార్తె ఐశ్వర్యకు సీబీఐ నోటీసులు జారీ చేశాయని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బుధవారం బెంగళూరులో వెల్లడించారు.

Published : 09 Feb 2023 04:21 IST

శివమొగ్గ, న్యూస్‌టుడే: తనకు ఈడీ, తన కుమార్తె ఐశ్వర్యకు సీబీఐ నోటీసులు జారీ చేశాయని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బుధవారం బెంగళూరులో వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న తనను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కొనలేక.. అడ్డదారులలో తనను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాను ఈడీ అధికారుల ముందు ఈ నెల 22న హాజరవుతానని వెల్లడించారు. తన కుమార్తె బెంగళూరులో నిర్వహిస్తున్న ‘నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ కళాశాల’కు సీబీఐ అధికారులు వచ్చి నోటీసులు జారీచేశారని తెలిపారు. కళాశాల ఫీజులు, వాటి వివరాలను తాము ఏటా ఆదాయపన్ను విభాగం అధికారులకు అందిస్తున్నా, కొత్తగా సీబీఐ ఆ వివరాలు ప్రశ్నించడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటికే పలుసార్లు ఈడీ, సీబీఐ ముందు విచారణకు హాజరై వివరణలు ఇచ్చానని, న్యాయస్థానాలలో కేసుల విచారణ కొనసాగుతోందని చెప్పారు. తన నివాసంలో దొరికిన నగదుకు వివరాలు ఇచ్చిన తర్వాత, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు ఇచ్చిన విరాళాల వివరాలు చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఒకదాని తర్వాత మరో కేసు, నోటీసులతో తనను ఇబ్బంది పెట్టి, లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని