బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 09 Feb 2023 04:21 IST

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

ఈనాడు, దిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ... ‘75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం 14% దాటలేదు. తెలంగాణ శాసనసభలో 119 స్థానాలుంటే 22 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలుంటే 38 మంది మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. లోక్‌సభలోనూ కేవలం 96 మంది బీసీ ఎంపీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీలకూ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తేనే సమన్యాయం జరుగుతుంది. వెనుకబడిన వర్గాల సమస్యలపై 35 ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతోపాటు జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఆందోళనకు భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ సంఘీభావం తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, తెలంగాణ, ఏపీ కన్వీనర్‌లు లాల్‌ కృష్ణ, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని