అదానీ కోసం నిబంధన తొలగింపు

‘‘ఒక సంస్థకు రెండు విమానాశ్రయాలు ఇవ్వకూడదని నీతిఆయోగ్‌ సిఫార్సు చేసినా అదానీ గ్రూప్‌నకు ఆరు విమానాశ్రయాలు ఇచ్చారు.

Published : 09 Feb 2023 04:21 IST

నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం

‘‘ఒక సంస్థకు రెండు విమానాశ్రయాలు ఇవ్వకూడదని నీతిఆయోగ్‌ సిఫార్సు చేసినా అదానీ గ్రూప్‌నకు ఆరు విమానాశ్రయాలు ఇచ్చారు. దానికి లబ్ధి చేకూర్చేందుకు బిడ్డింగ్‌ ప్రక్రియలో ప్రీ క్వాలిఫికేషన్‌ అనుభవమనే నిబంధనను తొలగించారు’’ అని కాంగ్రెస్‌ పార్టీ నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మారిషస్‌, సైప్రస్‌, యూఏఈ, కరేబియన్‌ ప్రాంతాల్లోని షెల్‌ కంపెనీల నుంచి నేరుగా అదానీ గ్రూప్‌నకు నగదు సరఫరా అయినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. పది రోజుల్లో రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైపోయింది. సెబీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?  నౌకాశ్రయాలు సొంతం చేసుకున్న తర్వాత అదానీ గ్రూప్‌ సముద్ర కార్గో టారిఫ్‌ను 15 నుంచి 20 శాతం పెంచింది. దీనిపై విచారణ జరిపించాలి’’ అని కోరారు.

రుజువుల్లేని ఆరోపణలు ఎలా చేస్తారు?: ఓం బిర్లా

సభలో రుజువుల్లేని ఆరోపణలు ఎలా చేస్తారని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా ప్రశ్నించగా.. తాను మాట్లాడిన ప్రతిదానికి రుజువులున్నాయని ఉత్తమ్‌ బదులిచ్చారు. రుజువులుంటే చూపాలని సభాపతి కోరగా.. తప్పకుండా చూపుతానని ఉత్తమ్‌ తెలిపారు. ‘రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను ఒక వ్యక్తిపై చర్చగా మళ్లించడం సరికాదు. అది మీకు మంచిదైనా, దేశానికి మంచిది కాదు. చరిత్ర దానిని సరి చేస్తుంది’ అని సభాపతి వ్యాఖ్యానించారు. తాను పైలెట్‌గా చేశానని రఫేల్‌కు సంబంధించిన కాంట్రాక్టులను అనిల్‌ అంబానీకి ఎలా ఇచ్చారో తెలియట్లేదని ఉత్తమ్‌ అన్నారు. బోయ వాల్మీకి, కాయిత లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు