అదానీ వ్యవహారంపై భారాస వాకౌట్‌

అదానీ గ్రూప్‌ వ్యవహారంపై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడించిన అంశాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని భారాస ఎంపీలు ఉభయ సభల్లో బుధవారం డిమాండ్‌ చేశారు.

Published : 09 Feb 2023 04:21 IST

పార్లమెంట్‌ ఉభయ సభల్లో జేపీసీ విచారణకు డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: అదానీ గ్రూప్‌ వ్యవహారంపై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడించిన అంశాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని భారాస ఎంపీలు ఉభయ సభల్లో బుధవారం డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభలో లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్న సమయంలో నామా మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై గత మూడు రోజులుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి ఎదుట, సభాపతి ఎదుట ఉంచామని, స్పందన లేనందున సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో ఛైర్మన్‌ చర్చకు అంగీకరించకపోవడంతో భారాస ఎంపీలు వాకౌట్‌ చేశారు. అంతకుముందు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆప్‌, శివసేన (ఠాక్రే) ఎంపీలతో కలిసి భారాస ఎంపీలు ఆందోళన చేశారు. ఆందోళనలో కేశవరావు, నామాతో పాటు భారాస లోక్‌సభ పక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌ నేత, బీబీ పాటిల్‌, మాలోత్‌ కవిత, పసునూరి దయాకర్‌, రాములు రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని