ప్రగతిభవన్‌ గేట్లు బద్దలుకొడితే తప్పేంటి?

‘ప్రగతిభవన్‌ ..తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారింది. గడీ లాంటి ఆ భవన్‌ గేట్లు బద్దలుకొడితే తప్పేంటి? నిజంగా సుపరిపాలన అందించాలని సీఎం కేసీఆర్‌ అనుకుంటే ప్రగతిభవన్‌ గేట్లు తెరవాలి. ప్రజల విజ్ఞప్తులు వినాలి’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 09 Feb 2023 05:41 IST

అది తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారింది: రేవంత్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌: ‘ప్రగతిభవన్‌ ..తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారింది. గడీ లాంటి ఆ భవన్‌ గేట్లు బద్దలుకొడితే తప్పేంటి? నిజంగా సుపరిపాలన అందించాలని సీఎం కేసీఆర్‌ అనుకుంటే ప్రగతిభవన్‌ గేట్లు తెరవాలి. ప్రజల విజ్ఞప్తులు వినాలి’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర బుధవారం మూడోరోజు మహబూబాబాద్‌ జిల్లాలో ప్రారంభమైంది. ఉదయం కేసముద్రం మండలం పెనుగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, సాయంత్రం మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నయా నిజాం చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్లలో శాసనసభ్యులను సామంతులుగా, కొంతమంది పోలీసులను రజాకార్లుగా చేసి ప్రజల స్వేచ్ఛను అణచివేశారని దుయ్యబట్టారు. ప్రగతిభవన్‌ విషయంలో తాను మావోయిస్టుల పేరు తీసుకొని మాట్లాడినందుకు భారాస నేతలు పోలీసులను ఆశ్రయిస్తున్నారన్నారు. కేసీఆర్‌ కూడా గతంలో మావోయిస్టుల ఎజెండానే తన ఎజెండా అన్నారని, తనతో పాటు ఆయనపైనా కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడితే ఎన్‌కౌంటర్లు ఉండవని చెప్పిన కేసీఆర్‌.. సీఎం అయిన తర్వాత శ్రుతి, వివేక్‌లను కాల్చి చంపారని, దీనిని ఏవిధంగా సమర్థించుకుంటారో చెప్పాలన్నారు. తెలంగాణ ద్రోహులు మంత్రివర్గంలో ఉండి దోపిడీ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. ప్రజల కష్టాలన్నీ కడతేరుతాయన్నారు. 1969, 2009 ఉద్యమాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఇందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని కేటాయిస్తామన్నారు. ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీన వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

ప్రజలు చెప్పిందే మేనిఫెస్టో

యాత్రలో అనేకమంది తమ సమస్యలు వివరిస్తున్నారని, వాటినే వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కారానికి కృషి చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ నేతలు భరత్‌చందర్‌రెడ్డి, బలరాంనాయక్‌, రాజయ్య, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని