అదానీపై వేడెక్కిన రాజ్యసభ

హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు సంస్థల వ్యవహారంపై చర్చించాల్సిందేనని విపక్షాలు బుధవారం పార్లమెంటులో మరోసారి పట్టుబట్టాయి.

Published : 09 Feb 2023 04:21 IST

చర్చకు మరోసారి వాయిదా తీర్మానాలు
సభాపతి తిరస్కరణ.. భారాస, ఆప్‌, సేన వాకౌట్‌
సభ్యుల తీరు సరికాదన్న ధన్‌ఖడ్‌
మోదీపై రాహుల్‌ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన భాజపా

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు సంస్థల వ్యవహారంపై చర్చించాల్సిందేనని విపక్షాలు బుధవారం పార్లమెంటులో మరోసారి పట్టుబట్టాయి. అదానీతో ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడింది. దీంతో ఉభయసభల్లోనూ వాతావరణం వేడెక్కిపోయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎట్టకేలకు మొదలైనా ఉభయ సభల్లోనూ అధికార-విపక్షాలు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నాయి. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల మీద సంయుక్త విచారణ సంఘాన్ని నియమించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. అదానీ ఎదుగుదలకు కారణం ప్రధానితో ఉన్న స్నేహ బంధమేనా అని ప్రశ్నించారు. కేవలం రెండున్నరేళ్లలో అదానీ సంపద 13 రెట్లు పెరిగిపోయిందని, అది ఎలా సాధ్యమైందో అర్థం కావట్లేదని చెప్పారు. ఆధారాల్లేకుండా దురుద్దేశాలు ఆపాదించవద్దని ఛైర్మన్‌ వారించారు. మోదీపై వ్యాఖ్యల్ని సభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా ఖండించారు. విదేశీ నివేదికలు ఆధారంగా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడానికి పార్లమెంటును వేదికగా చేసుకోవద్దని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ విపక్ష సభ్యులకు చెప్పారు. ఆరోపణలకు ఆధారాలతో రావాలని సూచించారు. తమ దేశభక్తిని శంకిస్తారా అంటూ విపక్ష ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారు. నిజం మాట్లాడితే దేశ వ్యతిరేకులవుతారా అని ఖర్గే ప్రశ్నించారు. విపక్షాన్ని ఎదుర్కోవడంలోనే ప్రభుత్వ బలం ఆధారపడి ఉంటుందని విపక్ష సభ్యులు చెప్పారు. 2002 గుజరాత్‌ అల్లర్లు.. రాజధర్మం గురించి మాజీ ప్రధాని వాజ్‌పేయీ చేసిన వ్యాఖ్యల్ని ఖర్గే ప్రస్తావించినప్పుడు సభలో వాతావరణం మరింత వేడెక్కింది.

కేశవరావు తీరు దురదృష్టకరమన్న ధన్‌ఖడ్‌

రాజ్యసభలో 267 నిబంధన కింద కె.కేశవరావు (భారాస), సంజయ్‌సింగ్‌ (ఆప్‌), సంజయ్‌ రౌత్‌, ప్రియాంక చతుర్వేది (శివసేన-ఠాక్రే) ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు సభాపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించడంతో ఆ పార్టీల సభ్యులు వాకౌట్‌ చేశారు. మంగళవారం తాము చేసిన వాకౌట్‌పై ఛైర్మన్‌ వ్యాఖ్యల మీద కేశవరావు అభ్యంతరం తెలిపారు. దానిపై ఛైర్మన్‌ స్పందించారు. ‘‘మీరు నిరసన వ్యక్తం చేసిన తీరు అత్యంత దురదృష్టకరం. నేను నిన్న చెప్పినదాన్ని మీరు పూర్తిగా విన్నట్లు లేదు. నేను చెప్పిందంతా రికార్డుల్లో ఉంది. నిబంధనల్ని పరిశీలించుకోండి. నేను నా భావాలను, కోట్ల మంది ప్రజల భావాలను చెప్పాను. మీరు మీ స్థానంలో కూర్చోండి. సభ నడవాల్సిన తీరు ఇది కాదు’’ అని స్పష్టంచేశారు. సభ సజావుగా సాగకపోవడం ప్రజలకు ప్రమాదకర సంకేతాలు పంపిస్తుందని, వారిలో ఆగ్రహానికి ఇది కారణమవుతోందని చెప్పారు. వాకౌట్‌ చేసిన సభ్యులు ఆ తర్వాత గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

రాహుల్‌పై చర్యకు జోషి డిమాండ్‌

అదానీ ఉదంతంలో ప్రధాని మోదీపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనపై సభాహక్కుల నిబంధన కింద చర్య తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే డిమాండ్‌ చేశారు. ఎవరిపైనైనా ఆరోపణ చేసేముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని