భవిష్యత్తులోనూ మద్య నిషేధం విధించే వీల్లేకుండా చేసిన జగన్‌

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మద్య నిషేధం అమలుచేసే వీల్లేకుండా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఇప్పుడే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ దుయ్యబట్టారు.

Updated : 09 Feb 2023 05:39 IST

మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మద్య నిషేధం అమలుచేసే వీల్లేకుండా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఇప్పుడే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ దుయ్యబట్టారు. మహిళల తాళిబొట్లు తెగితేనే నవరత్నాల అమలు అనేలా.. మద్యం అమ్మకాలపై నెలకు రూ.540 కోట్లు లక్ష్యాలు విధించారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘2020-21 సంవత్సరంలో ఏపీలో 571 మంది మత్తుకు బానిసలై చనిపోయినట్లు ఎస్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోంది. ఏపీలోనే గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరా అధికంగా ఉందని స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. మద్య నిషేధం అమలు చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మహిళల్ని దారుణంగా వంచించారు. తన ఖజానా నింపడానికి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ అమ్మకానికి గేట్లు తెరిచారు’ అని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 50 నెలలైనా మద్యం దుకాణాల్లో డిజిటల్‌ విధానం ఎందుకు ప్రవేశ పెట్టలేదని నిలదీశారు. ‘అధికారంలోకి రాగానే తెదేపా సానుభూతిపరులు, ఇతరుల బార్‌ లైసెన్సులను సీఎం లాక్కున్నారు. వాటిని తన పార్టీ వారికి కట్టబెట్టారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్మిస్తున్నారు. మద్యం తయారీ కంపెనీలు, రవాణా వ్యవస్థలూ వైకాపా నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఇవన్నీ మద్యనిషేధ ప్రచార కమిటీ అధ్యక్షుడు లక్ష్మణరెడ్డికి కన్పించడం లేదా? అధ్యక్షుడిగా లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఆయన.. ఎక్కడ ప్రచారం చేస్తున్నారు?’ అని జవహర్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని