విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై కేంద్రానికి డీపీఆర్‌ పంపలేదు

‘విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్‌ పంపలేదు. కానీ, రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పంపినట్లు చెప్పడం సిగ్గుచేటు.

Published : 09 Feb 2023 04:32 IST

సాయిరెడ్డి పంపామనడం సిగ్గుచేటు
అదానీకి కొత్త ప్రాజెక్టు ఇవ్వడంలో మర్మమేంటి?
భాజపా నేత సత్యకుమార్‌

ఈనాడు, అమరావతి: ‘విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్‌ పంపలేదు. కానీ, రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పంపినట్లు చెప్పడం సిగ్గుచేటు. సీబీఐ కేసులు, బాబాయి హత్య కేసులతో ఉచ్చు బిగుస్తుందన్న ఆందోళన, నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నార’ని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. విశాఖలో అదనంగా 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను అదానీకి అప్పగించడం వెనుక తాడేపల్లి ఆంతర్యమేంటని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వం ఎలా అవినీతికి పాల్పడాలి? అప్పులు ఎలా చేయాలనే ఆలోచిస్తుంది తప్ప అభివృద్ధి గురించి కాదు. అప్పులతో పుట్టబోయే బిడ్డల భవిష్యత్తుకూ అన్యాయం చేస్తోంది. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటాగా నిధులు, స్థలాలు ఇవ్వడం లేదు. తన తండ్రి వైఎస్సార్‌ హయాంలో జరిగిన ఒప్పందాలను జగన్‌ విస్మరించారు. రూ.ఐదు వేల కోట్లు ఇవ్వకపోవడంతో పెట్రో కాంప్లెక్స్‌ వంటి భారీ ప్రాజెక్టులు ఆగిపోయాయి. స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం, మెట్రో ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి, నాలుగేళ్లుగా విఫలమయ్యారు. కొత్తగా ఒక్క పరిశ్రమా తేలేదు. పైగా ప్రత్యేక హోదాను ఎందుకు ప్రస్తావిస్తున్నారో తెలియదు. రాజధాని అమరావతిపై ఎన్నికలయ్యాక మాటమార్చి రైతుల నోట్లో మట్టికొట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉన్నా, భాజపాను నిందిస్తున్నారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పుస్తకాలు అచ్చేసిన వైకాపా.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. సలహాదారులకు రూ.లక్షల్లో వేతనాలిస్తూ, ఉపాధ్యాయులకు ఇవ్వరా?’ అని తూర్పారపట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటికంటే ఎక్కువ సంస్థలను రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిందని సత్యకుమార్‌ గుర్తుచేశారు.


సాయిరెడ్డి వ్యవహారం.. మోసపూరితం!

లేని ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను విజయసాయిరెడ్డి మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేక కేంద్రంపై సాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌నాయుడు మరో ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని