అదానీ గ్రూపు ఆస్తులను జాతీయం చేయండి

అదానీ గ్రూపు కంపెనీలు వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 09 Feb 2023 05:39 IST

కేంద్రాన్ని కోరిన భాజపా నేత సుబ్రమణ్యస్వామి

చెన్నై: అదానీ గ్రూపు కంపెనీలు వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల ఆస్తులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి, వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ‘పీటీఐ’ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణ్యస్వామి.. అదానీ కంపెనీల వ్యవహారం, కేంద్ర బడ్జెట్‌, పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ మరణంపై సానుభూతి వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

భాజపా పవిత్రతను నిరూపించుకోవాలి

‘అదానీ గ్రూపు ఆస్తులన్నిటినీ ప్రధాని మోదీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలని కోరుకుంటున్నా. వచ్చిన నగదును నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలి. అదానీతో ఒప్పందాలు లేవని కాంగ్రెస్‌ చెబుతోంది. కానీ, ఆ పార్టీలో అదానీతో ఒప్పందాలున్న వ్యక్తుల గురించి నాకు తెలుసు. అయినా కాంగ్రెస్‌ను పట్టించుకోను. భాజపా తన పవిత్రతను నిరూపించుకోవాలి. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారని ప్రజల్లో ఒక భావన ఉంది. దానిపై స్పష్టతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదే’నని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు