Modi: నేను ఉన్నంతకాలం కాంగ్రెస్‌కు ఊపిరాడదు

కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరిస్థితి చూస్తే జాలేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని బెళగావిలో మోదీ మాట్లాడారు.

Updated : 28 Feb 2023 08:28 IST

ఖర్గేను చూస్తే జాలేస్తోంది
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ
‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌’లో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ. 16 వేల కోట్లు

ఈనాడు, బెంగళూరు: కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరిస్థితి చూస్తే జాలేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని బెళగావిలో మోదీ మాట్లాడారు. ‘ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఎండలో నిలబడినా ఆయనకు గొడుగు పట్టాలన్న ఆలోచన నేతలకు రాలేదు. అదే సమయంలో.. మరొకరికి ఎండ తగలకుండా గొడుగులు పెట్టారు. పేరుకు మాత్రమే ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు. ప్రపంచానికి తెలుసు పార్టీ రిమోట్‌ ఎవరి చేతిలో ఉందో’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. తమకు అడ్డుగా ఉన్న నేతలను కాంగ్రెస్‌ ఎప్పుడూ అవమానిస్తూనే ఉంటుందని నిందించారు. గతంలో కర్ణాటక నేతలు నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్‌లను ఎలా అవమానించిందో తెలిసిందేనని గుర్తు చేశారు. ‘నేను బతికుంటే కాంగ్రెస్‌కు ఊపిరి ఆడదు. అందుకే మోదీ పోవాలని నిత్యం నినదిస్తుంటారు. కొందరైతే నాకు గోతులు తవ్వుతుంటారు. కానీ నేనే వారికి సమాధి కడతా’ అని ప్రధాని పేర్కొన్నారు.

త్వరలో స్వదేశీ విమానం..: భారతీయ పౌరులు స్వదేశీ విమానం (మేడ్‌ ఇన్‌ ఇండియా ప్యాసెంజర్‌)లో ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని ప్రధాని మోదీ అన్నారు. శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక విమాన మార్గాలున్న దేశంగా భారత్‌ అవతరించనుందని తెలిపారు. 2014 వరకు కేవలం 75 విమానాశ్రయాలుండగా, గత 9 ఏళ్లలో మరో 75 కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. హవాయ్‌ చెప్పులు ధరించిన సామాన్యుడు కూడా విమానంలో (హవాయ్‌ జహాజ్‌) ప్రయాణించాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు.


యడియూరప్ప స్ఫూర్తి..

మాజీ సీఎం యడియూరప్ప ప్రజా జీవితం స్ఫూర్తి నింపుతుంటుందని ప్రధాని మోదీ కొనియాడారు. 80 ఏళ్లు పూర్తి చేసుకున్న యడియూరప్పకు మొబైల్‌ ఫోన్ల ఫ్లాష్‌ లైట్లు వెలిగించి శుభాకాంక్షలు తెలపాలని సూచించారు. రైతుబంధుగా ఆయన సేవల స్ఫూర్తితో తాజా బడ్జెట్‌లో ‘శ్రీ అన్న’ పథకాన్ని రూపొందించామన్నారు. రూ. 22,600 కోట్ల విలువైన వివిధ పథకాలు, పనులను ప్రధాని ప్రారంభించారు. శివమొగ్గలో విమానాశ్రయం, రైల్వే, రహదారి, జల్‌జీవన్‌ ప్రాజెక్టులను ప్రారంభించారు. బెళగావిలో ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌’లో భాగంగా రూ. 16 వేల కోట్లను రైతుల ఖాతాలకు చేరవేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులు ఈ పరిహారాన్ని అందుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని