ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం.. కేంబ్రిడ్జి ప్రసంగంలో రాహుల్‌గాంధీ
భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని, తనతో సహా పలువురు విపక్ష నేతల ఫోన్లపై నిఘా కొనసాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
లండన్/దిల్లీ: భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని, తనతో సహా పలువురు విపక్ష నేతల ఫోన్లపై నిఘా కొనసాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలపైనా దాడి జరుగుతోందన్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తూ ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్ నేత పరాయి గడ్డపై దేశం పరువు తీస్తున్నారని ధ్వజమెత్తింది. బ్రిటన్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్’ అనే అంశంపై మాట్లాడిన ఆయన.. నరేంద్ర మోదీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రికార్డు చేసిన ఆ వీడియో దృశ్యాలను కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పెగాసస్ స్పైవేర్ వివాదాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ‘‘నా ఫోన్లోకి పెగాసస్ జొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లపైనా ఇలాగే నిఘా పెట్టారు’’ అని మోదీ సర్కారుపై రాహుల్ మండిపడ్డారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదులు నన్ను చంపేసేవాళ్లే
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర చేస్తున్నప్పుడు తనకు ఓ భయానక అనుభవం ఎదురైందని రాహుల్‌గాంధీ తెలిపారు. ‘‘ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని, పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది చెప్పారు. కానీ, నేను మా పార్టీ వాళ్లతో మాట్లాడి యాత్రలో ముందుకెళ్లేందుకే నిశ్చయించుకున్నా. అలా నడుస్తున్నప్పుడు ఓ గుర్తుతెలియని వ్యక్తి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలని చెప్పాడు. కాంగ్రెస్ నేతలు నిజంగానే జమ్మూకశ్మీర్‌కు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అని అడిగాడు. ఆ తర్వాత కొంత సేపటికి ఆ వ్యక్తి.. కాస్త దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ ‘వాళ్లంతా ఉగ్రవాదులు’ అని చెప్పాడు. ఆ ముష్కరులు నన్ను చంపేసే వారే. కానీ అలా చేయలేదు’’ అంటూ వివరించారు.
ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా
భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ‘రాహుల్ మళ్లీ విదేశీ గడ్డకు వెళ్లి.. స్వదేశంలోని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లలో కాదు ఆయన మైండ్‌లోనే పెగాసస్ ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్