ప్రజాగ్రహాన్ని సావకాశంగా మలచుకుంటాం

నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళలపై హింస, సంపద అంతా కొద్దిమంది వద్దే పోగుపడడం వంటి అంశాలపై భారతదేశ ప్రజల్లో అంతర్లీనంగా ఆగ్రహం వ్యక్తమవుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.

Published : 06 Mar 2023 03:37 IST

విపక్షాల్లో చర్చలు కొనసాగుతున్నాయి
ప్రజాస్వామ్య వ్యవస్థల్ని భాజపా విచ్ఛిన్నం చేస్తోంది
గొంతు అణచివేతకే బీబీసీపై ఐటీ సర్వే: రాహుల్‌

లండన్‌: నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళలపై హింస, సంపద అంతా కొద్దిమంది వద్దే పోగుపడడం వంటి అంశాలపై భారతదేశ ప్రజల్లో అంతర్లీనంగా ఆగ్రహం వ్యక్తమవుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. దీంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని భాజపా సర్కారు విచ్ఛిన్నం చేస్తున్న తీరుపై విపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాడేలా ఐక్యత దిశగా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. లండన్‌ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం ‘భారత పాత్రికేయుల సంఘం’ (ఐజేఏ) నిర్వహించిన ‘ఇండియా ఇన్‌సైట్స్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రత్యామ్నాయాన్ని చూపించేందుకు తామంతా ఐక్యంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ప్రజావాణి వినిపించలేకపోతున్నాం

‘‘భారత ప్రజాస్వామ్యంపై పెనుదాడి జరుగుతోంది. గొంతెత్తితే అణచివేయాలనే ధోరణి పెరుగుతోంది. ఇటీవల ముంబయి, దిల్లీల్లో బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సర్వేలే దీనికి ప్రబల తార్కాణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడాన్ని బీబీసీ మానుకుంటే కేసులన్నీ మాయమైపోతాయి’’ అని రాహుల్‌ వివరించారు.

సంపదంతా సన్నిహితులకే

‘‘భారత్‌ మౌనంగా ఉండాలని భాజపా కోరుకుంటోంది. అలాగైతేనే దేశ సంపదనంతా తమకు సన్నిహితులైన ముగ్గురు నలుగురికి కట్టబెట్టవచ్చని భావిస్తోంది. ప్రజల దృష్టి మళ్లించి, ఈ పనిని చక్కబెడుతున్నారు. భారత్‌లో ఎన్నికలంటే రాజకీయ పార్టీల మధ్య పోరాటం మాత్రమే కాదు. సంస్థాగత నిర్మాణంపైనా మేం పోరాడుతున్నాం. భాజపా, ఆరెస్సెస్‌లను ఓడించాలనే భావన విపక్షాల్లో బలంగా పాదుకొంది. దానిపై సందేహమే లేదు. కొన్ని వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరగాలి’’ అని రాహుల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని