ఎన్నికల్లో విజయానికి.. ఎలా ముందుకెళ్దాం!

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాను గెలిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన కార్యాచరణపై పార్టీ ముఖ్యనేతల ఆలోచనలను తెలుసుకునేందుకు భాజపా శ్రీకారం చుట్టింది.

Updated : 07 Mar 2023 05:56 IST

రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తున్న భాజపా అగ్రనాయకత్వం
ముఖ్య నేతల సూచనలు తీసుకుంటున్న సునీల్‌ బన్సల్‌

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాను గెలిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన కార్యాచరణపై పార్టీ ముఖ్యనేతల ఆలోచనలను తెలుసుకునేందుకు భాజపా శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే కీలకాంశాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ మేరకు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి (సంస్థాగత), భాజపా ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. పలువురు ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమవుతూ అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌లు పూర్తిస్థాయిలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం, పార్టీ కార్యక్రమాల్లో మార్పులు చేపట్టడం వంటి అంశాలపై బన్సల్‌ ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ పక్రియ కొనసాగుతుందని సమాచారం. అనంతరం అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ అగ్ర నాయకత్వానికి నివేదికను అందజేస్తారని తెలుస్తోంది. వచ్చే వారం  అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చేందుకు ముందే పార్టీ నేతల ఆలోచనలను తెలుసుకునే ప్రక్రియను ముగిస్తారు. ఈ నివేదిక ఆధారంగా అమిత్‌ షా రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ముందుకు వెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను వివిధ రూపాల్లో భాజపా తెలుసుకునే ప్రక్రియను ఇప్పటికే కొనసాగిస్తుండగా తాజాగా చేపట్టిన అభిప్రాయసేకరణ కీలకమైందని రాష్ట్ర పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు