nara lokesh- Yuvagalam: మహిళల భద్రతకు పటిష్ఠ విధానాలు తెస్తాం

‘ఈశాన్య రాష్ట్రాల తరహాలో మహిళ భద్రతకు పటిష్ఠమైన విధానాలు తీసుకువస్తాం. విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తాం.

Updated : 09 Mar 2023 06:45 IST

రాష్ట్రంలో విక్రయించే మద్యం పురుగుమందుకన్నా విషం
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, కడప: ‘ఈశాన్య రాష్ట్రాల తరహాలో మహిళ భద్రతకు పటిష్ఠమైన విధానాలు తీసుకువస్తాం. విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తాం. మహిళలను గౌరవించే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యేక పాఠ్యాంశాన్ని తీసుకొస్తాం...’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం చింతపర్తి విడిది కేంద్రంలో బుధవారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షతన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో లోకేశ్‌ మహిళలకు మోకాళ్లపై వంగి నమస్కారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘మద్యాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చారు. అమ్మ ఒడి పథకం కింద ఎంత మంది పిల్లలున్నా.. సాయం చేస్తామని ఒక్కరికే ఇచ్చి మోసం చేశారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్లు ఇస్తామని మాట తప్పారు. రాష్ట్రంలో 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లో ఒక్కరికీ న్యాయం జరగలేదు. దిశ చట్టానికి ఆమోదముద్ర పడకుండానే హడావుడి చేస్తున్నారు...’ అని ధ్వజమెత్తారు.  ‘రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం పురుగుమందు కన్నా విషతుల్యమైందని పరిశోధనలో తేలింది. జే బ్రాండ్‌ మద్యంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి...’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. బుధవారం 13.9 కి.మీ దూరం సాగిన పాదయాత్ర మదనపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గురువారం సీటీఎం గ్రామంలో 500 కి.మీ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, నేతలు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైకాపా నేత

పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లె మాజీ సర్పంచి, వైకాపా నేత అశోక్‌ దంపతులు లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ అశోక్‌ ప్రమాదానికి గురై మంచానికే పరిమితమై రెండు నెలలపాటు మృత్యువుతో పోరాడారు. ఆయన కుటుంబ సభ్యులు అప్పట్లో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని సాయం కోరడంతో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రూ.30లక్షల ఆర్థిక సాయం చేయించారు. ఈ నేపథ్యంలో అశోక్‌ కుటుంబసభ్యులు లోకేశ్‌ను కలిసి చంద్రబాబుకి, పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి.. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు వేల మంది నిపుణులు ఉండగా.. మరో తొమ్మిది వేల మంది కోర్సు పూర్తి చేసుకోబోతున్నారని, ప్రభుత్వ పరంగా తమకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని