పంచసూత్రాలతో భూ వివాదాల పరిష్కారం.. ధరణి అదాలత్‌లో జైరాం రమేశ్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు.

Published : 11 Mar 2023 05:57 IST

ఉద్యోగులకు పాత పింఛన్‌ పథకం అమలు చేస్తామని వెల్లడి

పెద్దపల్లి-ఈనాడు డిజిటల్‌, ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. భూవివాదాల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా పంచసూత్రాలను అమలు చేస్తామని చెప్పారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధరణి అదాలత్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌ గాంధీభవన్‌లోనూ జైరాం రమేశ్‌ విలేకరులతో మాట్లాడారు. ధరణిలో 60 లక్షల భూ రికార్డులుంటే ఇందులో 20 లక్షలు పలు వివాదాలతో ఉన్నాయన్నారు. మొదటి సూత్రంగా ధరణి పోర్టల్‌లో మార్పులు చేపట్టి మెరుగుపరుస్తామని చెప్పారు. రెండో సూత్రం కింద రెండేళ్లలోపు భూసర్వే చేసి ‘ఒకే పట్టా- ఒకే రికార్డు’ అనేలా తయారుచేస్తామన్నారు. మూడోది భూరికార్డులకు సంబంధించి మొత్తం 125 చట్టాలున్నాయని, 3 వేల మేర ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని వీటిని రద్దుచేసి ‘ఒకే చట్టం- ఒకే హక్కు’ ఉండేలా చేస్తామన్నారు. నాలుగో సూత్రం ప్రకారం 2013లో భూసేకరణ చట్టాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అభివృద్ధి పనులకు భూమి సేకరించాలంటే భూయజమాని అనుమతి తప్పక తీసుకునేలా చేస్తామన్నారు. అయిదో సూత్రంలో రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది కౌలు రైతులకు భూస్వాములకు, పట్టాదారులకు ఉండే హక్కులన్నీ కల్పిస్తామన్నారు. ‘ధరణి అదాలత్‌’ వచ్చే 90 రోజుల్లో 119 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్వహిస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌మాట్లాడుతూ ధరణితో 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని తాము అధికారంలోకి రాగానే 2024 జనవరి 1 నుంచి 100 రోజుల్లోగా పంచాయతీల్లో భూసమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే మాట్లాడుతూ పేదలకు కేటాయించిన స్థలాలకు హక్కులు, పథకాలు రాకుండా చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. సీఎల్పీనాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదలకు కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ స్థలాలు వేల ఎకరాలు మంజూరు చేస్తే ధరణి పేరిట కేసీఆర్‌ లాక్కున్నారని విమర్శించారు. సుల్తాన్‌పూర్‌లో 200 మందికి భూ సమస్యలుండగా వారిలో 10 మందికి జైరాం రమేశ్‌, ఏఐసీసీ కార్యదర్శి కొప్పులరాజు ‘కాంగ్రెస్‌ హామీ కార్డు’ అందజేశారు.

ప్రజల దృష్టి మళ్లించడానికే కవిత ధర్నా

ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే.. మహిళా రిజర్వేషన్లు అమలుచేయాలని కవిత ఇప్పుడు దిల్లీలో ధర్నా చేస్తున్నారని జైరాం రమేశ్‌ అన్నారు. 2010 మార్చి 9నే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం పొందిందని చెప్పారు యూపీఏ భాగస్వామ్య పక్షాలు సహకరించనందున లోక్‌సభలో ప్రవేశపెట్టలేకపోయామన్నారు.  కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి భారాస అని. రాష్ట్రంలో వారితో పొత్తు ఉండదని చెప్పారు.. ఇతర పార్టీలతో పొత్తులను పరిశీలిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పార్టీ అని.. ఎవరే అభిప్రాయమైనా స్వేచ్ఛగా చెప్పవచ్చని, చెరుకు సుధాకర్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాంటివేనని చెప్పారు.

ఎన్నికల ప్రణాళికలో పాత ఫించన్‌ పథకం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ‘పాత పింఛన్‌ పథకం’(ఓపీఎస్‌) అమలుచేస్తామని, దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెడతామని జైరాం రమేశ్‌ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఓపీఎస్‌ ప్రధానాంశంగా మారడంతో అక్కడి భాజపా సీఎం బొమ్మై దీనిపై ఓ అధ్యయన బృందాన్ని రాజస్థాన్‌కు పంపినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయని, విలేకరులకు క్లిప్పింగ్‌లను చూపించారు. జాతీయ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు స్పందించాలని పీసీసీ అధికార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని