Pawan Kalyan: సభలో అడుగుపెట్టి తీరతాం

వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. శాసనసభలో అడుగుపెట్టేలాగే తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు.

Updated : 15 Mar 2023 10:19 IST

అందుకు అనుగుణంగానే ప్రణాళిక
మా దగ్గర డబ్బుల్లేవు.. పంచలేం
175 స్థానాల్లో పోటీ చేయాలని వైకాపా సవాలు చేస్తోంది
కానీ ప్రజలు కోరుకుంటున్నదే జరుగుతుంది
గెలుస్తామన్న నమ్మకం కుదిరితే.. ఒంటరి పోటీకీ వెనుకాడం
జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. శాసనసభలో అడుగుపెట్టేలాగే తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. ‘‘నాతో సహా పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలి. మా దగ్గర డబ్బుల్లేవు. మేం డబ్బులు పంచలేం. మీ ఓటు మీరే కొనుక్కుని మాకు ఓటేయండి’’ అని మంగళవారం రాత్రి మచిలీపట్నంలో జరిగిన పార్టీ పదో ఆవిర్భావ కార్యక్రమానికి అశేష సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు, మద్దతుదారులను ఉద్దేశించి ఆయన అన్నారు.

‘‘వైకాపా వచ్చే ఎన్నికల్లో ఒకటి జరగకూడదని కోరుకుంటోంది. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని మమ్మల్ని సవాలు చేస్తోంది. కానీ ఏం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో నాకు తెలుసు.. అదే జరుగుతుంది. ఓటును వృథా కానివ్వం. జనసేన సత్తా చాటుతాం. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గత ఎన్నికల్లో గెలవకుండానే ఇన్ని పోరాటాలు చేశాం. మీరు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ఇంకా ఎంతగా చేస్తామో గుర్తించి అండగా ఉంటారని ఆశిస్తున్నాను. వచ్చే ఆవిర్భావ సభను ఎన్నికల్లో గెలిచి చేసుకుందాం.

కేవలం నోటి మాటలు, నినాదాలపైనే ఆధారపడకుండా... తగినంత డేటా, రీసెర్చి, రిపోర్టులు తెప్పించుకున్నాక, జనసేన కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం కుదిరితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికీ వెనుకాడబోం. కానీ అది ఎంతవరకు సాధ్యమో తెలియాలంటే డేటా తెప్పించుకోవాలి. నేను బయటకు వస్తే గజమాలలు వేస్తున్నారు. అవి చూసినప్పుడల్లా దండలు కాదయ్యా ఓట్లు వేయండి.. గుండెలు బాదుకోవడం కాదయ్యా.. గుండెల్లో పెట్టుకుని ఓట్లు వేయండి.. అనాలనిపిస్తుంది. నేను ఏ నిర్ణయమైనా రాష్ట్ర హితం కోరే తీసుకుంటాను. నాతో నడిచేవారే నావారు. నన్ను శంకించేవారు నావారు కాదు’ అని పేర్కొన్నారు. తెదేపాతో జనసేనకు పొత్తు కుదిరిపోయిందని, 20 సీట్లకు అంగీకరించామని వాట్సప్‌లో వచ్చే సందేశాలను నమ్మొద్దని కోరారు. ‘నా చేతలు చూడండి. పదేళ్లు పార్టీని నిలబెట్టి మీకు అండగా ఉన్నవాడిని. నన్ను నమ్మండి’ అని ఆయన కోరారు. ఇంకా ఏం మాట్లాడారంటే..  

వైకాపా వ్యతిరేక ఓటు ఎందుకు చీలనివ్వనన్నానంటే...

‘‘నేను వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని అన్నానంటే దానికి కారణాలున్నాయి. భాజపాతో పొత్తు పెట్టుకుని మేం అనుకున్న ప్లాన్‌ అమలుచేసి ఉంటే, తెదేపా అవసరం లేకుండానే ఎదిగేవాళ్లం. అమరావతే రాజధాని అని చెప్పి.. లాంగ్‌మార్చ్‌ చేద్దామనుకున్నాం. దిల్లీలో భాజపా జాతీయ నాయకులూ దానికి అంగీకరించారు. కానీ ఇక్కడికి వచ్చాక భాజపా స్థానిక నాయకుడు అలాంటిదేమీ లేదన్నారు. భాజపాకు అండగా ఉంటానని నేను చెబుతుంటే... కలసి కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకు రాకపోతే నేనేం చేయను? నేను నష్టపోవచ్చు గానీ, నా రాష్ట్రం నష్టపోకూడదు. ప్రజలు నాకు అండగా లేకపోయినా వారిని నేను వదలను. నేను అనుకున్నట్టు జనసేన, భాజపా కార్యక్రమం జరిగి ఉంటే.. ‘వైకాపా వ్యతిరేక ఓటు’ అనే మాట నా నోటి నుంచి వచ్చేది కాదు. తెదేపాపై నాకు ప్రత్యేకమైన ప్రేమ, చంద్రబాబుపై ఆరాధన లేవు. చంద్రబాబు సమర్థులన్న గౌరవం ఉంది. విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడుకున్న అంశమని, సొంత గనులు కేటాయించాలని ప్రధాని మోదీని ధైర్యంగా అడిగాను. నామీద కేసుల్లేవు. అందుకే ధైర్యంగా మాట్లాడగలిగాను. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణను నువ్వు చెప్పావనే ఆపాం కదా అన్నారు. విశాఖ ఉక్కు కూడా చూడాలని కోరాను. కానీ అది జరగాలంటే కార్మికసంఘాలు కదలిరావాలి. రాష్ట్రప్రభుత్వం అండగా ఉండాలి. రాష్ట్రమంతా ఒకరోజు బంద్‌ చేస్తే గనులు ఎందుకివ్వరు? అక్కడి కార్మికులకే కోపం లేదు. చేతులు ఎత్తమంటే అనుమానంగా ఎత్తుతున్నారు. వారికే లేనప్పును నేను మోదీతో ఎన్నిసార్లు గొడవ పెట్టుకోను?

తెలంగాణలో ఆంధ్రావాడివన్నారు

అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టుగా ఉంది స్థానిక భాజపా నాయకుల పరిస్థితి. వారూ కలసి రారు. నన్నూ చేయనివ్వకపోతే ఎలా? దీన్ని భాజపా జాతీయ నాయకుల దృష్టికీ తీసుకెళ్లాను. మేం తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తామంటే.. నువ్వు ఆంధ్రావాడివి, ఇక్కడెలా పోటీచేస్తావని స్థానిక భాజపా నాయకులన్నారు. ఆంధ్రావాళ్ల ఓట్లు కావాలి గానీ, పోటీ చేయొద్దంటే ఎలా? అక్కడా మాకు అభిమానులున్నారు. నేను భాజపాకు అండగా నిలబడ్డా. వారే ముందుకు తీసుకెళ్లడం లేదు.

అందరి ఆశీస్సులతో మా ప్రభుత్వం

ఎవరైనా గెలిచేకొద్దీ బలపడతారు. జనసేన దెబ్బ పడేకొద్దీ బలపడుతోంది. నిలబడే వ్యక్తులుంటే వెన్నంటి నిలుస్తామని ఈ పదేళ్లలో మీరంతా చూపించారు. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన.. పులివెందుల సహా ప్రతిచోటా 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించింది. తెలంగాణతో కలిపితే 6.55 లక్షల పైచిలుకు ఉన్నారు. పదేళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డాం. మన్ననలు పొందాం. ఎప్పటికీ జనాలకు అండగా ఉంటాం. అందరి ఆశీస్సులతో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.

వెయ్యి కోట్లని వాగితే చెప్పుదెబ్బలే

వెయ్యి కోట్లపై మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి నాకు రూ. 1000 కోట్లు ఆఫర్‌ చేశారంట.. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. నేను మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలనా? సిద్ధాంతంతోనే మీకు దగ్గర కాగలను. గతంలోనూ ఇలాగే ప్యాకేజీ ఇచ్చారంటే చెప్పు చూపాను. తెనాలికి చెందిన వెంకటేశ్వరావు చేసిన చెప్పుల్నే నేను వేసుకుంటా. పిచ్చిపిచ్చిగా వాగితే వాటితో కొడితే గట్టిదెబ్బ పడుతుంది. నేను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు. అవసరమైతే ఇచ్చేవాడినే.

నా సంపాదన రోజుకు రూ.2 కోట్లు

ఇప్పుడు నేను 22 రోజుల పాటు ఒక సినిమా చేస్తున్నా. దానికి రూ.45 కోట్లు తీసుకుంటున్నా. అంటే రోజుకు రూ.2 కోట్లు. అలాంటి నేను డబ్బుకు ఆశపడతానా?ఒక్క కులం వాళ్లు చూస్తేనే రోజుకు రూ.2 కోట్లు తీసుకోగలనా? అందరూ గుండెల్లో పెట్టుకోవడం వల్లే అది సాధ్యమైంది.

రంగా ఇంట లేని కులం మీకెందుకు?

వంగవీటి రంగా కమ్మవారి ఆడపడుచుని పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు ఆలోచించడం లేదు? అక్కడలేని కులం మీకెందుకు? రంగాయే కాదు.. కాపుల్లోని చాలామంది నాయకులు వేరే కులాలవారిని చేసుకున్నారు. అయినా ఇంకా కులం అని పట్టుకుని వేలాడదామా? కులం కులం అని చచ్చిపోదామా?  

అలా జరిగితే భాజపా పొత్తు నుంచి వచ్చేస్తా

ముస్లింలపై దాడులు జరిగినా, వారు అభద్రతాభావానికి లోనవుతున్నారనుకున్నా.. భాజపా పొత్తు నుంచి బయటకు వచ్చేస్తాను. భాజపాతో పొత్తు అనగానే.. ముస్లిం అక్కచెల్లెళ్లు అంతా నన్ను వదిలేస్తామంటున్నారు. వారికి ఒకటే మాట చెబుతున్నా. నేను భాజపాతో ఉన్నంతకాలం మీపై దాడులు జరగనీయను. మీరు జగన్‌ను నమ్ముతున్నారు. ఆయన దిల్లీకి వెళ్లి కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మద్దతు ఇస్తారు. భాజపాకూ మద్దతిస్తున్నారు. మరి ముస్లిం సమాజం ఆయన్ను ఎందుకు అడగదు?

కులం చూసి ఓటేస్తారా?  

వైకాపా ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోంది.. కులం చూసి ఓటేస్తారో, గుణం చూసి ఓటేస్తారో మీరే నిర్ణయించుకోవాలి. ముఖ్యమంత్రి మా కులం వ్యక్తి అని ఓటేస్తారు. ఆయన నిజంగా మహానుభావుడే అయితే నేను రాజకీయాల్ని వదిలేస్తా. మీ దగ్గరకు వచ్చే కులాల నాయకుల్ని నిలదీయండి. నాకు అధికారమిస్తే కూలీలా పనిచేస్తా. ఒక కులాన్ని గద్దె ఎక్కించడానికి నేను లేను. అయితే కులాల ఐక్యత సమాజానికి అవసరం.  నేను కాపు కులంలో పుట్టాను. దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను. కానీ నాకున్న జ్ఞానం అణగారిన కులాలన్నింటికీ అండగా ఉండాలని చెబుతుంది. కమ్మ, రెడ్డి తదితర సామాజికవర్గాలను ద్వేషించకూడదు, గొడవలు పెట్టకూడదంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కులపు పెత్తనం ఆగిపోవాలి. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలంటే జనసేనను పాలనలోకి తీసుకురావాలి. అగ్రకులాల్లోనూ పేదలు ఉన్నారు. ఈ దేశం అన్యాయం చేస్తోందని అగ్రకుల పేదలు, యువతలో కడుపుమంట ఉంది. వారికి అండగా ఉంటాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు, విదేశీవిద్యకు అవసరమైన విధానాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచుకోవడానికి.. ఎన్నికలకు రూ.150 కోట్లు ఖర్చుపెట్టేంత డబ్బు ఉంది. పేదలకు ఉపకారవేతనాలు ఇవ్వడానికి డబ్బు లేదు.

ధర్మాన్ని నమ్ముకున్నందుకు అంతా వదిలేశారు

నేను ఎంతో ఇష్టపడిన ప్రధాని మోదీని కూడా రాష్ట్రానికి ప్రత్యేక కోదా కోసం ఎదిరించాల్సి వచ్చింది. కానీ మీరు నా వెంట నిలబడలేదు.  పాతికమంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పుడు మెడలు వంచి దండాలు పెడుతున్నారు. రాష్ట్రం కోసం నేను నిలబడితే ప్రజలు, యువత నిలబడలేదు. అదే తెలంగాణలో అయితే యువత గొంతులు కోసేసుకున్నారు. ఇక్కడ యువత కులాల చట్రంలో ఇరుక్కుపోవడం వల్ల పోరాట స్ఫూర్తి కొరవడింది. ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని చెబుతున్నా.. మా కులపోడు కాదనుకుంటారు. మీరు కాదనుకోవడం వల్ల నాకు పడ్డ శిక్ష.. నేను ఒంటరివాడిననయ్యాను. ధర్మాన్ని పట్టుకుని నిలబడితే అందరూ వదిలేశారు.

ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల నియోజకవర్గంలో ఆ ప్రాంతానికే పరిమితమైన చిన్న కులం గురించే ఆలోచించే నేను.. నేను పుట్టిన కాపు కులం సంక్షేమం గురించి ఎందుకు ఆలోచించను? అలాగని ఎంతసేపు నా కులానికే అంతా చేసుకోవాలనుకునే వ్యక్తిని కాదు. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మా కులం నుంచి ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. మీరు ఓటు వేయండి అయి చూపిస్తాను. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. ఈ ముఖ్యమంత్రి  చిన్న చిన్న కులాలకు భయపడరు. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి, సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి. ప్రస్తుత ముఖ్యమంత్రి గోదావరి జిల్లాలకు వెళ్లి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోనని కరాఖండీగా చెబితే ఎందుకు ఓట్లు వేశారు? కాపుల తప్పు కూడా ఉంది కదా? కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ఏం ప్రయోజనం? కులాలకు, మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే మీకు గర్వకారణం కాదా? సొంత కులానికే అన్నీ చేసుకుంటున్నాడని ఇప్పుడున్న సీఎంని అందరూ తిడుతున్నారు కదా? నేను అలా అవ్వలేనే? ఈ రాష్ట్రం దశ, దిశ మీరే మార్చగలరు. నేర రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కాపులు నడుం కడితే.. యాదవులు, గౌడలు, శెట్టిబలిజలు, ఎస్సీలు, మిగతా అన్ని కులాలవారూ మీ వెనుక ర్యాలీ కడతారు. మీరు విడిపోతే మళ్లీ అరాచకమే రాజ్యమేలుతుంది.

డబ్బులు కొట్టేయడానికి చిన్న పిల్లాడు కాదా?  

మేం అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తాం. దీనికి కీలకమైనవి రెండు. ఒకటి జవాబుదారీతనం. రేపు మా ఎమ్మెల్యేలను మీరు ఎన్నుకుంటే మీకు జవాబుదారీగా ఉంటాం. నాతో సహా ఎవరూ మీరు అడిగే ప్రశ్నల తప్పించుకోలేని పరిస్థితులో ఉండాలి. ప్రజాస్వామయ్యంలో ప్రశ్నించడం చాలా అవసరం. సీపీఎస్‌ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన పెద్దమనుషులు దాన్ని రద్దు చేయలేదు సరికదా.. మా నాయకుడు చిన్న పిల్లాడు, ఏమీ తెలియకుండా మాట్లాడేశారని సకల శాఖ మంత్రి చెపారు. డబ్బులు దోచేయడానికి, బెదిరించడానికి, సిమెంటు ఫ్యాక్టరీలు పెట్టడానికి చిన్న పిల్లాడు కాదా?’’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.


రైతుల్లో కులాలు తెచ్చింది జగనే: మనోహర్‌

రైతుల్లో కులాలు తెచ్చిన మొదటి ముఖ్యమంత్రి జగనేనని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు. ‘ఆయన సీఎం అయ్యాక రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి పవన్‌ కల్యాణ్‌ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ‘మన పొలాల పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటోలంట. ఇంత వింత కార్యక్రమం ఎక్కడైనా ఉందా? గడప గడపకు వైకాపా నాయకులు వచ్చి ఇళ్లకు, ఫోన్లకూ స్టికర్లు అతికిస్తారంట. కావాలంటే వైకాపా ఎమ్మెల్యేలపైన, నేతలపై పచ్చబొట్లు వేసుకోండి. మేం కష్టపడి కట్టుకున్న ఇళ్లపై వేయొద్దు’ అని హెచ్చరించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు