అవకాశమిస్తే సభలోనే బదులిస్తా

దేశానికి వ్యతిరేకంగా తాను లండన్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ, దీనిపై లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తే చెప్పదలచుకున్నది చెబుతానని కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు.

Published : 17 Mar 2023 04:13 IST

నా వ్యాఖ్యలపై చెప్పదలచుకున్నది అక్కడే చెబుతా
స్పీకర్‌ ఓంబిర్లాను కోరిన రాహుల్‌

దిల్లీ: దేశానికి వ్యతిరేకంగా తాను లండన్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ, దీనిపై లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తే చెప్పదలచుకున్నది చెబుతానని కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. బ్రిటన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో భేటీ అయ్యారు. సభలో మాట్లాడనిస్తే తాను ఏమనుకుంటున్నదీ చెబుతాననీ, లేదంటే బయట మాట్లాడతానని అనంతరం విలేకరులకు చెప్పారు. భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై మొదటిసారి ఆయన విలేకరుల సమావేశంలో స్పందించారు. దేశానికి వ్యతిరేకంగా తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంచేస్తూ.. భాజపా ఆరోపణలను తోసిపుచ్చారు. అదానీ వ్యవహారంలో మోదీ భయపడుతున్నారని, అసలు ఆయనకు.. పారిశ్రామికవేత్త గౌతం అదానీకి మధ్య సంబంధమేమిటని ప్రశ్నించారు. ‘నలుగురు కేంద్ర మంత్రులు నాపై ఆరోపణలు చేశారు. కాబట్టి అభిప్రాయాన్ని సభలో తెలిపే హక్కు నాకు ఉంది. అందుకే పార్లమెంటుకు వచ్చాను. ఎంపీగా పార్లమెంటులో సమాధానం చెప్పడం నా బాధ్యత. ఆ తర్వాతే మీడియా ముందు వివరణ ఇవ్వగలను. దేశంలో ప్రజాస్వామ్యం అమల్లో ఉంటేనే నేను మాట్లాడగలను. ఇది ప్రజాస్వామ్యానికి పరీక్ష’ అని అన్నారు. ఈ విడత సమావేశాల్లో తొలిసారి ఆయన లోక్‌సభలో అడుగుపెట్టగానే భాజపా సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేసి, క్షమాపణల కోసం డిమాండ్‌ వినిపించారు.

ఇలా ప్రారంభమై అలా వాయిదా!

పార్లమెంటులో నాలుగో రోజూ వాయిదాల పర్వం కొనసాగింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వాయిదాకు ముందు, తర్వాత కలిపి లోక్‌సభ కేవలం ఐదు నిమిషాలే సమావేశమైనట్లయింది. టీఎంసీ సభ్యులు నల్లటి మాస్కులు ధరించి రాజ్యసభలో నిరసన తెలిపారు. ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా నినాదాలు చేయడం వల్ల సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సమావేశమై, శుక్రవారానికి వాయిదా పడింది. లోక్‌సభ కూడా శుక్రవారానికి వాయిదా పడింది.

పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల మానవ హారం

అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో మానవ హారంగా ఏర్పడి ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులతో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ప్రభుత్వం కావాలనే సభను అడ్డుకుంటోందని ఆరోపించారు. అదానీ అంశం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్షం అడ్డుకుంటోందని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జేపీసీలో ఏ నిజం బయటపడుతుందో.. దాన్ని అందరూ అంగీకరిస్తారనీ, అందుకే తాము దానిని కోరుతున్నామని చెప్పారు. అంతకుముందు ఉభయ సభల్లో వ్యూహాన్ని సమన్వయం చేసుకునేందుకు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఖర్గే ఛాంబర్లో సమావేశమయ్యారు. దానిలో తీసుకున్న నిర్ణయం మేరకు మానవ హారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని