బంధుగణాన్ని బయటపడేసేందుకే ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటన అనుమానాస్పదంగా ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 18 Mar 2023 05:32 IST

తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌

ఈనాడు, దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటన అనుమానాస్పదంగా ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రులను ఒంటరిగానే కలిశారని, సమావేశంలో ఏం జరిగిందనేది ఎవరు చెప్పడం లేదన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తన బంధుగణాన్ని బయటపడేసేందుకే ఆయన దిల్లీ వచ్చినట్లుందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు 17 సార్లు దిల్లీ వచ్చినా ఒక్కసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడలేదని, పర్యటన వివరాలు వెల్లడించలేదన్నారు. సీఎం దిల్లీ వచ్చిన ప్రతిసారి ఒకే రకమైన మీడియా ప్రకటన విడుదల చేస్తున్నారని, అందులో కొంతైనా కొత్తదనం ఉండడం లేదని కనకమేడల ఎద్దేవా చేశారు. ప్రస్తుత పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటనగానే భావించాల్సి ఉంటుందన్నారు. శాసనసభ సమావేశాల సమయంలో వాటిని వదిలేసి ముఖ్యమంత్రి దిల్లీ వచ్చారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వెంటిలేటర్‌పై ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆక్సిజన్‌, మోదీ, అమిత్‌ షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారం లేకపోతే పూట గడవని స్థితిలో రాష్ట్రం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌లాగా కేంద్రంతో పోరాడే ధైర్యం జగన్‌మోహన్‌రెడ్డికి ఉందా అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు