వైకాపాకు చెంపదెబ్బ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బని, ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రం అంతా కనిపిస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 18 Mar 2023 06:48 IST

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బని, ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రం అంతా కనిపిస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘గత సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించిన వైకాపాకు... ఇప్పుడు 30 శాతానికి ఓట్లు పడిపోయాయి. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాందిగా నిలుస్తుంది. 2024లో తెదేపా తప్పక విజయం సాధిస్తుంది. రాజధాని సహా వైకాపా ప్రభుత్వం చెప్పిన మాటలపై ప్రజలకు విశ్వాసం లేదు...’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైందని గంటా చెప్పారు.


తెదేపా విజయానికి తొలిమెట్టు: సోమిరెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే : 2024 ఎన్నికల్లో తెదేపా విజయానికి తొలిమెట్టుగా ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తోందని చెప్పారు.


పులివెందులలో తెదేపాను ఆదరించారు

‘‘సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో పట్టభద్రులు తెదేపాను ఆదరించారు. దీనికి జగన్‌ ఏం సమాధానం చెప్పి తప్పించుకుంటారు? ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాంల... పశ్చిమ, తూర్పు రాయలసీమల్లో ముందంజపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబుతారు?’’ అని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ నిలదీశారు. దమ్ముంటే మంత్రులు, స్పీకర్‌ వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల ఫలితాల్ని బట్టి మేధావులు, చదువుకున్న వారు జగన్‌ను నమ్మడం లేదని తేలిపోయిందన్నారు.

జలీల్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే


దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ప్రజలకు అర్థమైంది

‘‘జగన్‌ చెప్పేదొకటి, చేసేదొకటి అని ప్రజలకు అర్ధమై పోయింది. రాష్ట్రాన్ని జగన్‌ ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. మూడు రాజధానులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు గుర్తించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు ఒకేలా స్పందించారు. పెట్టుబడుల సదస్సు, రాజధాని, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా ఉత్తుత్తి మాటలేనని వారికి అర్థమైంది.  వైకాపా పాలనలో సామాన్యులు మరిన్ని సమస్యలు, కష్టాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారంతా తెదేపాకే పట్టం కడతారు’’

పల్లా శ్రీనివాసరావు, తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు


వైకాపా అభ్యర్థులను ఓడించిన నిరుద్యోగ యువత

‘‘ఏటా జాబ్‌ క్యాలండర్‌, మెగా డీఎస్సీ అనే మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన వైకాపా.. నిరుద్యోగుల్ని గాలికొదిలేసింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని నేపథ్యంలో ప్రజలు వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు. నిరుద్యోగులు తిరుగులేని దెబ్బకొట్టారు. ఇంకా మిగిలింది 2024 ఎన్నికలే’’

షేక్‌ సిద్ధిక్‌, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు