జే ట్యాక్స్‌లతో ధరల పెరుగుదలలో ఏపీ నం.1

జే ట్యాక్స్‌ల వల్ల పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నం.1గా ఉందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల కారణంగా  సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు.

Published : 18 Mar 2023 05:42 IST

సామాన్యులు బతికే పరిస్థితి లేదు
తెదేపా నేతల ధ్వజం
అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, అమరావతి : జే ట్యాక్స్‌ల వల్ల పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నం.1గా ఉందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల కారణంగా  సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. మూడు రాజధానులంటూ జగన్‌ చేస్తున్న మోసాలను పట్టభద్రుల ఎన్నికల ద్వారా ఉత్తరాంధ్రులు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా ప్రజలు తెదేపావైపే నిలిచారని స్పష్టం చేశారు. ‘ధరలు తగ్గాలంటే జగన్‌ పోవాలి’ అని నినాదాలు చేశారు. ‘ఆకాశంలో ధరలు, ఆకలి కడుపులతో పేదలు’, ‘కరెంటు బిల్లు నాడు రూ.500.. నేడు రూ.1,500’ అని ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు శుక్రవారం పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉందని ఎద్దేవా చేశారు. ‘ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో జగన్‌రెడ్డికి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ లాంటివి. తెదేపాకు ఓటేస్తే మూడు రాజధానులకు ఉత్తరాంధ్రులు వ్యతిరేకం అనే భావన వ్యక్తమవుతుందని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా గెలుస్తాం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రభుత్వాన్ని నడిపే శక్తిని జగన్‌ కోల్పోయారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ‘2023-24 బడ్జెట్‌లోని లోపాలపై సూచనలు చేయనివ్వకుండా మా గొంతునొక్కి బయటకు పంపారు. మైక్‌ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆరోపించారు. ‘ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం ఇందుకు నిదర్శనం’ అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్ర బడ్జెట్‌లో ఫ్యాన్సీ నంబర్లతో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అంకెల గారడి చేసి ప్రజలను తప్పుదారి పట్టించారు’ అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. ‘తెదేపా హయాంలో బడ్జెట్‌ మీద అర్థవంతమైన చర్చ జరిగేది. ఇప్పుడు తెదేపా సభ్యులకు కనీసం 20 నిమిషాల సమయం కూడా కేటాయించడం లేదు’ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తప్పుపట్టారు. అసెంబ్లీలో తెదేపా ఉనికిని భరించలేకపోతున్నారని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు