160కి పైగా సీట్లు తెదేపావే

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 160 స్థానాలకు పైగా గెలుచుకుంటామని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు జోస్యం చెప్పారు.

Published : 18 Mar 2023 05:42 IST

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 160 స్థానాలకు పైగా గెలుచుకుంటామని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుండటంతో శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో శుక్రవారం రాత్రి ఆ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఈ ఎన్నికలు తెదేపాకు ఎంతో బలాన్నిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాలతో విసిగిపోయిన ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి వైఖరి స్పష్టం చేశారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి అవసరం లేదని భావించి వారి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ విజయం వారికే అంకితం. విశాఖ రాజధాని కావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడి ప్రజలు తిరస్కరించారు. సీఎం రుషికొండకు గుండు గీయిస్తే ప్రజలు జగన్‌కు గుండు గీసి సమాధానం చెప్పారు..’  అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో కీలకమైన బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుంటే సీబీఐ, హత్య కేసుల్లో చికుక్కున్న వారిని కాపాడుకోవడానికే సీఎం జగన్‌ హస్తినకు వెళ్లారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.


జగన్‌ రాజధాని కబుర్లు ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మడం లేదు: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ఈనాడు-అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని కబుర్లు ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించడం లేదని, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి లభించిన భారీ ఆధిక్యమే నిదర్శనమని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏ రౌండ్‌లోనూ వైకాపా అభ్యర్థి తెదేపా అభ్యర్థికి పోటీ ఇవ్వలేకపోయారని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘రాజధాని పేరుతో విశాఖలో జగన్‌ చేసిన విధ్వంసం. నాలుగేళ్ల చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని గుర్తించారు. అందుకే ఈ వన్‌సైడ్‌ ఫలితాలు...వైకాపా అంతానికి ఆరంభం ఇదే. సైకో పోవాలి...సైకిల్‌ రావాలి...’ అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు