సీఎం దిల్లీ పర్యటన రహస్యమేంటి?
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటనపై చర్చకు అనుమతించాలని తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి అనుమతించకపోవడంతో శాసనసభ అయిదోరోజు సమావేశాలు శనివారం వాడివేడిగా మొదలయ్యాయి.
ఆయన సొంత ప్రయోజనాలకా.. రాష్ట్రం కోసమా?
చర్చకు పట్టుబట్టిన తెదేపా ఎమ్మెల్యేలు
వాయిదా తీర్మానాన్ని అనుమతించని స్పీకర్‌పై ఎజెండా కాపీలు చించి విసిరిన సభ్యులు
11 మంది తెదేపా సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసిన సభాపతి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటనపై చర్చకు అనుమతించాలని తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి అనుమతించకపోవడంతో శాసనసభ అయిదోరోజు సమావేశాలు శనివారం వాడివేడిగా మొదలయ్యాయి. చర్చకు అనుమతించాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభలో కొద్దిసేపు అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు 11 మంది తెదేపా సభ్యులను ఒకరోజు పాటు సభాపతి తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభ మొదలవ్వగానే సభాపతి సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టడంతో తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్యేలు సీఎం దిల్లీ పర్యటనపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కోరారు. సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. చర్చకు అనుమతించాలని సభాపతి పోడియంను చుట్టుముట్టి నినాదాలిచ్చారు. స్పీకర్ వద్దకు వెళ్లి ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. ఎజెండాను చించి సభాపతిపైకి విసరడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా గౌరవం పాటించకుండా.. సభాపతిపైకి కాగితాలు విసరడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభాపతికి సూచించారు. తెదేపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సీహెచ్ జగ్గిరెడ్డి, కె.శ్రీనివాస్, ధర్మశ్రీ, మధుసూదన్‌రెడ్డి అన్నారు. ప్రజాధనంతో దిల్లీ వెళ్లిన సీఎం తన పర్యటన వివరాలు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలను ఒక రోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, మరికొందరు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు పర్యటనలపై చర్చిద్దామా?: బుగ్గన
సీఎం హోదాలో చంద్రబాబు 30సార్లు దిల్లీ వెళ్లారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. వీటిపైనా సభలో చర్చిద్దామా? అని తెదేపా సభ్యులను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశాక, అంతకుముందు రాజేంద్రనాథరెడ్డి సభలో మాట్లాడారు. ‘రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకే సీఎం దిల్లీ వెళుతున్నారు. సీఎం దిల్లీ పర్యటనపై చర్చకు వాయిదా తీర్మానం ఇవ్వడం దేశచరిత్రలో లేదు. వాయిదా తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తున్నారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా సభ్యులు స్పందిస్తూ... చంద్రబాబు దిల్లీ పర్యటనపై చర్చకు సిద్ధమేనన్నారు.
కళంకితుడిగా ఉండదలుచుకోలేదు: సభాపతి
తెదేపా సభ్యులు సభలో బాధ్యతారహితంగా వ్యవహరించారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. తెదేపా సభ్యుల సస్పెన్షన్ తర్వాత పలువురు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడాక సభాపతి ప్రతిస్పందించారు. ‘తెదేపా సభ్యులు ఎలా వ్యవహరించినా.. నేను సభను బాధ్యతగా నడిపించాలి కదా.. చరిత్రలో కళంకితుడిగా ఉండదలుచుకోలేదు’ అని సభాపతి అన్నారు.
పేకప్... పేకప్ వ్యాఖ్యలు
సభాపతి సస్పెండ్ చేశాక తెదేపా సభ్యులు సభనుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ‘పేకప్ ..పేకప్’ అన్నారు. దీనిపై తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ‘ఎన్నికల్లో మీ ఎమ్మెల్సీలు పేకప్.. 2024 ఎన్నికల్లో మీరూ పేకప్’ అంటూ వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Rain Alert: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
India News
Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్ లాయర్ ఎవరు..?
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుల జాబితా.. సిద్ధం చేసిన సిట్
-
Politics News
Revanth Reddy: పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్
-
India News
Mann Ki Baat: అవయవదానానికి ముందుకు రావాలి.. ప్రధాని మోదీ
-
Movies News
Shaakuntalam: ఆమెకు శిక్షణ అవసరం లేదు.. తను పుట్టుకతోనే సూపర్ స్టార్: సమంత