సంక్షిప్త వార్తలు (14)

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత శాఖల మంత్రి కేటీఆర్‌ కృషితోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెగా జౌళి పార్కును కేటాయించిందని భారాస ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తెలిపారు.

Updated : 19 Mar 2023 06:36 IST

కేటీఆర్‌ కృషితోనే రాష్ట్రానికి మెగా జౌళి పార్కు

ఎమ్మెల్సీ ఎల్‌.రమణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత శాఖల మంత్రి కేటీఆర్‌ కృషితోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెగా జౌళి పార్కును కేటాయించిందని భారాస ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మిగిలిన డిమాండ్లనూ కేంద్రం వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేనేత, జౌళి రంగాల అభ్యున్నతిని రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద జౌళిపార్కును వరంగల్‌లో ఏర్పాటు చేసింది. దీనికి మెగాపార్కు హోదా కోసం కేటీఆర్‌ తీవ్రంగా యత్నించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు వివిధ సందర్భాల్లో చేసిన వినతులను సైతం ప్రధాని నరేంద్రమోదీ పరిష్కరించాలి’ అని కోరారు.


అధికార ప్రతినిధుల కోసం యువజన కాంగ్రెస్‌ రిజిస్ట్రేషన్లు

దిల్లీ: అధికార ప్రతినిధులుగా యువతను నియమించడానికి ‘యంగ్‌ ఇండియా కే బోల్‌’ మూడో దశ కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభించినట్లు ‘భారత యువజన కాంగ్రెస్‌’ (ఐవైసీ) అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ తెలిపారు. గూగుల్‌ దరఖాస్తు ద్వారా మొదలైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 25 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ప్రాథమిక పోటీ జరుగుతుందని, తుదిపోటీ మాత్రం దిల్లీలో నిర్వహిస్తామని వెల్లడించారు. వాటిలో విజేతలను జాతీయ అధికార ప్రతినిధులుగా తీసుకుంటామని చెప్పారు. కొంతమందిని రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ప్రతినిధులుగా నియమిస్తామన్నారు. 18-35 ఏళ్లవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, హిందీ, ఆంగ్లంతో పాటు స్థానిక భాషల్లోనూ రకరకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.


ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు
భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజలపై లాఠీఛార్జి చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని భాజపా తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌ ఆరోపించారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆయన అహంకార ప్రభుత్వాన్ని మార్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే భయంతోనే కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను ఆయన గౌరవించడం లేదని తరుణ్‌ఛుగ్‌ విమర్శించారు.


ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ శనివారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి బయల్దేరిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ రవీందర్‌, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్‌ చేసి ఠాణాకు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకులకు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన సంఘీభావం తెలిపారు.


ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉంది

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉందని పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ మద్దతుగానే ఉంటుందని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వర్గీకరణకు రాజకీయ తీర్మానం కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ ఎస్సీ మోర్చా సమావేశాలకు శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.


అన్ని ఓట్లనూ రీకౌంటింగ్‌ చేయాలి

ఎన్నికల సంఘానికి వైకాపా లేఖలు

ఈనాడు, అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో లోపాలు ఉన్నాయని, మళ్లీ అన్ని ఓట్లనూ రీకౌంటింగ్‌ చేసేలా ఎన్నికల అధికారి, అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శనివారం దిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వేర్వేరుగా లేఖలు రాశారు.


ఈ విజయం లోకేశ్‌కు అంకితం: శ్రీకాంత్‌

చిత్తూరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీగా తన విజయం నారా లోకేశ్‌కు అంకితమని తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు. చిత్తూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. తనకు దిశానిర్దేశం చేసిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు, చెమటోడ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


దోపిడీ పాలనకు బుద్ధి చెప్పారు: అయ్యన్న

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెంపపెట్టు అని  తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శనివారం నర్సీపట్నంలో  ఆయన మాట్లాడుతూ.. దుర్మార్గ, దోపిడీ పాలనను పట్టభద్రులందరూ గుర్తించి ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు.


వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

గుంటూరు(పట్టాభిపురం), న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయమని పేర్కొన్నారు.


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెదేపా విప్‌ జారీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేసింది. ఈ నెల 23న నిర్వహించనున్న పోలింగ్‌లో పాల్గొని తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ ఎమ్మెల్యే, విప్‌ డోల బాలవీరాంజనేయస్వామి తెదేపా ఎమ్మెల్యేలకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను స్పీడ్‌ పోస్ట్‌లో పంపడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అందజేశారు.


చలో అసెంబ్లీకి కాంగ్రెస్‌ మద్దతు

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ర్యాలీలు, రోడ్డు షోలు, సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 1ని రద్దు చేయాలంటూ పోరాట ఐక్య వేదిక ఈ నెల 20న నిర్వహించే చలో అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.


వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు-అమరావతి: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు శనివారం లేఖ రాశారు. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, విజయనగరం, మన్యం జిల్లాల్లో వేరుసెనగ, పొగాకు, అరటి వంటి పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న రైతులు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో మిరప రైతులు, కృష్ణా, ఏలూరు, ఇతర చోట్ల వరి రైతులు నష్టపోయారని తెలిపారు. వర్షాలతో పాటు ఈదురు గాలుల వల్ల రాయలసీమలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.


రాజకీయాల్లో బెదిరించే పరిస్థితులొచ్చాయి

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు ఆవేదన

ఈనాడు, అమరావతి: ‘‘సాధారణ వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. గతంలో డబ్బులు అడిగి తీసుకునే వారు. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు పంచడం సర్వసాధారణమైంది. ఇప్పుడు కొత్త సంస్కృతి వచ్చింది. ఓటుకు డబ్బు తీసుకోకుంటే గుర్తు పెట్టుకుంటామని బెదిరించే పరిస్థితి రాజకీయాల్లో వచ్చింది. నా తోటి సభ్యుడు ఒకరు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్లు కావాలట. నేను మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను. నాకు మొత్తం సుమారు రూ.50 వేలు ఖర్చయింది’’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మండలిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయింది. ఉత్పత్తి రంగానికి అనుగుణంగా విద్యా విధానం ఉండటం లేదు. పాలిటెక్నిక్‌ చదివే వారు కూడా ఇంజనీరింగ్‌ విద్య వైపు వెళ్తున్నారు. ఇంటర్మీడియట్‌ విద్య మొత్తం కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లింది. ఇది మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 11.52 శాతం నిధులు మాత్రమే విద్యారంగానికి కేటాయించడం ఒక విధంగా ఆ రంగంపై నిర్లక్ష్యం చూపుతున్నట్లే’’ అని పేర్కొన్నారు. వైద్యానికి చేసే ఖర్చుల వల్ల 24 శాతం మంది పేదరికంలోకి వెళ్తున్నట్లు ఒక అధ్యయనం చెప్పిందని.. దీనిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించాలన్నారు. నాకు బడ్జెట్‌పై మాట్లాడడానికి ఇదే చివరి అవకాశమని.. 29న పదవీకాలం పూర్తవుతుందని సభలో తెలిపారు.  


వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్పు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాల్లో విద్యావంతులు వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ‘‘అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించడం మొదలు డబ్బు వెదజల్లడం, అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు వేయించడం లాంటి అనేక అక్రమాలకు పాల్పడినా అధికార పార్టీకి పరాజయం తప్పలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రమ జీవుల సమస్యలను పరిష్కరించకపోగా వారు సాగించిన ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం విధించిన ప్రభుత్వ తీరుకు ప్రతిఘటనే పట్టభద్రుల తాజా తీర్పు అని అభివర్ణించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన భాజపాకూ ఓటర్లు గుణపాఠం చెప్పారన్నారు. సమస్యలపై నిస్వార్థంగా పని చేస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థులు ఓడిపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయ స్థానాల్లో వైకాపాను ఓడించేందుకు తెదేపా ఆసక్తి చూపకపోవడాన్ని రాజకీయ వైఫల్యంగా భావిస్తున్నామని వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని