భాజపా పాలనలో మహిళలకు గౌరవం లేదు: తమ్మినేని

భాజపా పాలనలో మహిళలను గౌరవం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 19 Mar 2023 06:35 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి : భాజపా పాలనలో మహిళలను గౌరవం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని పార్లమెంటులో ప్రశ్నిస్తే... కేంద్ర మంత్రులు మహిళలదే తప్పని, పొట్టి దుస్తులు వేసుకుంటుండడంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు... ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ‘‘కేంద్ర  ప్రభుత్వం సంస్థలను ప్రైవేటుపరం చేస్తోంది. మద్దతునివ్వాలని సీఎంలపైనా ఒత్తిడి తెస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు పెట్టారు. తప్పుచేస్తే కేసులు పెట్టండి. అరెస్టు చేసి జైలుకు పంపినా సీపీఎం వ్యతిరేకించదు. కానీ, మోదీ స్నేహితుడు గౌతం అదానీ తప్పుడు లావాదేవీలతో రూ. కోట్లు కాజేసినా చర్యల్లేవు. భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారాసకు మద్దతు ఇస్తాం’’ అన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని