అమరుల ఆశయాలను నెరవేరుస్తాం: భట్టి

పేదల ఆశలు తీరేలా, అమరవీరుల ఆశయాలు నెరవేరేలా కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

Published : 19 Mar 2023 03:38 IST

ఇంద్రవెల్లి స్తూపానికి గద్దర్‌తో కలసి నివాళులు
టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌

ఈటీవీ-ఆదిలాబాద్‌: న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ గ్రామీణం: పేదల ఆశలు తీరేలా, అమరవీరుల ఆశయాలు నెరవేరేలా కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మూడోరోజు పాదయాత్రలో భాగంగా శనివారం ప్రజాగాయకుడు గద్దర్‌తో కలిసి ఇంద్రవెల్లి అమరుల స్తూపానికి నివాళులర్పించారు. వాన పడుతుండగా, చీకట్లోనే ఇంద్రవెల్లిలో ఏర్పాటుచేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆదివాసీలు, గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఐటీడీఏలను రాష్ట్రప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఐటీడీఏలను బలోపేతం చేయడంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో వారసత్వంగా ఉంటున్న గిరిజనేతరులకు హక్కులు కల్పిస్తామని వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, సంబంధిత మంత్రి సహా, కమిషన్‌ ఛైర్మన్‌, కమిటీని రద్దుచేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పేదల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీని పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గద్దర్‌ మాట్లాడుతూ భట్టి చేస్తోంది పాదయాత్ర కాదని జైత్రయాత్ర అని అభివర్ణించారు. మనసుతో మనసు కలుపుతూ ‘చేతికి’ అధికారం తీసుకొచ్చేలా చేస్తున్న యాత్రను స్ఫూర్తిగా తీసుకొని కలసిరావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు భట్టి కేస్లాపూర్‌లోని నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులతో మాట్లాడారు. కేస్లాపూర్‌లో మహిళలతో, ముత్నూర్‌ కుమురంభీం స్తూపం వద్ద ఆదివాసీలతో కలిసి భట్టి విక్రమార్క నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి గండ్రత్‌ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు