నేడు నిరుద్యోగ నిరసన దీక్ష

పేపర్ల లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 19 Mar 2023 03:38 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడి
పేపర్ల లీకేజీపై సమగ్ర విచారణకు డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి; కామారెడ్డి కలెక్టరేట్‌, గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పేపర్ల లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్న రేవంత్‌.. శనివారం కామారెడ్డి, రాజంపేటలలో నిర్వహించిన పాదయాత్రలో, విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను పదవుల నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్‌ చేశారు. ‘‘పేపర్ల లీకేజీ వెనుక ఓ ప్రజా ప్రతినిధి పీఏ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఆ వ్యక్తి సొంత మండలం మల్యాలకు చెందిన వంద మందికి వంద చొప్పున మార్కులు వచ్చాయి’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. పేపర్ల లీకేజీలో అరెస్టు చేసిన తొమ్మిది మంది నిందితులను సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయకుండానే.. ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని మంత్రి కేటీఆర్‌ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితుల్లో రాజశేఖర్‌ భాజపాకు చెందిన వ్యక్తి కాగా.. రేణుక, ప్రవీణ్‌ భారాస మనుషులని రేవంత్‌ పేర్కొన్నారు. రెండు పార్టీలు కలిసి నిరుద్యోగులను నట్టేట ముంచాయన్నారు.

సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్‌కుమార్‌్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. నవీన్‌ ఉరేసుకుని చనిపోయిన ఘటనపై ఆయన శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు