పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి: తెజస

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రే అని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం డిమాండ్‌ చేశారు.

Published : 19 Mar 2023 03:38 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రే అని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ విషయమై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శనివారం ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకేజీ ఒకరిద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశమంటూ మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం బాధాకరమన్నారు. అవి తమను తాము రక్షించుకోవడానికి చేస్తున్న వ్యాఖ్యలని అన్నారు. వ్యవస్థ కుళ్లిపోయినందునే వ్యక్తులు సాహసం చేశారని, పైనుంచి కింది వరకు వ్యవస్థ పటిష్ఠంగా ఉండి పాలకులు కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరాన్ని ముంచడమే కాకుండా ఇప్పుడు పైసల కోసం ప్రశ్నపత్రాలు సైతం అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదన్నారు. దీక్షలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వేశ్వర్‌రావు, రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్‌, బైరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని