తెలంగాణలోని సామెతను మాత్రమే ప్రస్తావించా!

భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు.

Published : 19 Mar 2023 03:38 IST

మరో ఉద్దేశం లేదు
మహిళా కమిషన్‌ ముందు హాజరై  వివరణ ఇచ్చిన బండి సంజయ్‌

రెజిమెంటల్‌బజార్‌, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. శనివారం భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్‌ మార్చి 15న కమిషనర్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున ఆ రోజు రాలేనని, ఈనెల 18న హాజరవుతానని వెల్లడించారు. ఈమేరకు ఆయన శనివారం కమిషన్‌ ముందు హాజరై వివరణనిచ్చారు. ఉదయం 11.10 గంటలకు లోపలికి వెళ్లిన సంజయ్‌ మధ్యాహ్నం 1.45కు బయటకు వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘‘మహిళా కమిషన్‌ నోటీసులకు సమాధానమిచ్చాను. అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయి వివరణ ఇచ్చా. తెలంగాణలోని సామెతను మాత్రమే ప్రస్తావించాను తప్ప మరో ఉద్దేశం లేదు. రాష్ట్రంలో పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని మంత్రి కేటీఆర్‌ కామన్‌సెన్స్‌ గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి కామన్‌సెన్స్‌ ఉందో.. ఎవరికి లేదో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. తనపైౖ రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.  మహిళా కమిషన్‌ లీక్‌ ఇచ్చినట్లు తాను భావించడం లేదని... అయితే జరుగుతున్న ప్రచారంపై కమిషన్‌ వివరణ ఇవ్వాలని కోరారు.

పేపరు లీక్‌పై విచారణకు అభ్యంతరమేంటి?

బండి సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్‌ లీక్‌ కేసులో తప్పు జరగనప్పుడు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపడానికి అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించారు. ‘‘అభ్యర్థులు రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినపుడు.. ఈడీ, సీబీఐ రాజ్యాంగ సంస్థలు కాదా? పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టయిన రేణుక కుటుంబం బీఆర్‌ఎస్‌లో ఉంది. నిందితుడు పదేళ్లుగా మీ దగ్గరే పనిచేస్తున్నపుడు ఎందుకు పట్టుకోలేకపోయారు. రాజశేఖర్‌ విషయంలో కమిషన్‌ ఇన్నాళ్లు ఏం చేసింది. టీఎస్‌పీఎస్సీని రద్దుచేసే అధికారం సీఎంకు లేనప్పుడు.. రద్దుచేసే అధికారం ఉన్నవారికి లేఖ ఎందుకు రాయడం లేదు’’ అని అన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భాజపా ప్రమేయం ఉంటే నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. సంజయ్‌ వెంట భాజపా మహిళా మెర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, కార్పొరేటర్లు దీపిక, సుచిత్ర, సరళ తదితరులు ఉన్నారు. అనంతరం సిద్దిపేటలో మాట్లాడుతూ..పేపర్‌ లీకేజీలో ఓ విశ్రాంత ప్రధాన అధికారి సూత్రధారి అని ఆరోపించారు. గతంలో సింగరేణి పేపర్‌ లీకేజీకి కూడా అతనే బాధ్యుడు అన్నారు. దీనిపై వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని