రాంగోపాల్‌ వర్మ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.. ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్‌ లేఖ

సినిమా డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

Updated : 19 Mar 2023 05:46 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సినిమా డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాంగోపాల్‌వర్మ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. ‘ఇప్పటివరకు దీనిపై సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అవుతుంది. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ వర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయమనండి’ అని సవాల్‌ చేశారు. నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేసి, వర్మ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని వీహెచ్‌ హెచ్చరించారు.

లీకేజీకి నిరసనగా నేడు ఆందోళనలు

గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీకి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, కేటీఆర్‌ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌, సింగరేణి, కానిస్టేబుల్స్‌..తాజాగా గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ఐటీ మంత్రి కేటీఆర్‌ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని