MLC Elections: విజేతగా ప్రకటించినా.. డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపొందారు.

Updated : 19 Mar 2023 07:18 IST

రోడ్డుపై తెదేపా నేతల బైఠాయింపు..నిరసన
అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డి సహా కీలక నేతల అరెస్టు
అర్థరాత్రి 1.30 దాటినా స్టేషన్‌లోనే నాయకులు

 

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపొందారు. శనివారం రాత్రి 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా, అర్ధరాత్రి 12 గంటల వరకూ ధ్రువీకరణపత్రం అందించలేదు. దీనిపై ఆగ్రహించిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ కారును అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులను అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసులే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే కాపాడేవారెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లఘించారని, దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్‌ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు.

ఇది చరిత్రాత్మక తీర్పు

‘అధర్మం.. అన్యాయం.. వంచన.. అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు తొలి అడుగు ఇది. మేధావులు, విద్యావంతులు చైతన్యవంతులై జగన్‌ దుర్మార్గపాలనను ఆమోదించలేదు. పశ్చిమలోనే కాదు.. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ ఎమ్మెల్సీ ఓటర్లు అసంతృప్తితో ఓట్లు వేశారు. ఇది చరిత్రాత్మక తీర్పు. పులివెందుల నివాసిగా ఉన్న నన్ను ఓడించడానికి జగన్‌ కోట్లు ఖర్చుచేశారు. ఓటర్లను ప్రలోభపెట్టారు. బోగస్‌ ఓట్లు వేయించారు.’

 భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ, తెదేపా


సీఈసీకి చంద్రబాబు లేఖ

ముఖ్యమంత్రి జగన్‌, ఆయన కార్యాలయం ఒత్తిడితో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత, తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి  లేఖ రాశారు. తెదేపా అభ్యర్థి గెలిచినట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించినా డిక్లరేషన్‌ ఇవ్వలేదని లేఖలో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని