పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా క్లీన్‌స్వీప్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఎన్నికలు జరిగిన మూడు నియోజకవర్గాల్లోనూ విజయదుందుభి మోగించింది.

Published : 19 Mar 2023 04:52 IST

పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా పోరాడి గెలుపు
రామగోపాల్‌రెడ్డి గెలిచినా డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంపై తెదేపా నిరసన
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో ఏకపక్ష విజయం
మూడుచోట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లలో 43.63% దక్కించుకున్న తెదేపా
వైకాపాకు 35.70% ఓట్లు

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఎన్నికలు జరిగిన మూడు నియోజకవర్గాల్లోనూ విజయదుందుభి మోగించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఏకపక్షంగా గెలిచింది. పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా పోరాడి విజయం దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు తెదేపా కంటే వైకాపా అభ్యర్థికే ఎక్కువగా వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలయ్యాక తెదేపా అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. ఆ ఆధిక్యం చివరివరకూ కొనసాగింది. దీంతో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి.. వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో శనివారం రాత్రి విజయం సాధించారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం చెల్లిన ఓట్లలో.. తెదేపా అభ్యర్థులకు 43.63% మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కాయి. వైకాపా అభ్యర్థులకు 35.70% ఓట్లు లభించాయి. రెండోస్థానంలో నిలిచిన వైకాపా కంటే 7.93% ఓట్లు తెదేపా అధికంగా సాధించింది. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 7,16,664 ఓట్లు పోలవ్వగా.. వాటిల్లో 6,63,782 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. వాటిల్లో మొదటి ప్రాధాన్యతకు ఓట్లు తెదేపాకు 2,89,630, వైకాపాకు 2,36,972 వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య 52,658 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలోనూ భాజపా అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

ఉత్తరాంధ్రలో 14.40%.. తూర్పు రాయలసీమలో 10.98% అధికం

* ఉత్తరాంధ్రలో వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ కంటే తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 27,216 మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ అధికార పార్టీ కంటే తెదేపా 14.40% ఓట్లు అధికంగా సాధించింది.

* తూర్పు రాయలసీమలో వైకాపా అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి కంటే తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు 27,262 మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా లభించాయి. ఇక్కడ అధికారపార్టీ కంటే తెదేపా 10.98% ఓట్లు అధికంగా సాధించింది.

* ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైకాపా కంటే తెదేపా 54,478 ఓట్లు అధికంగా సాధించింది.

* పశ్చిమ రాయలసీమ పరిధిలో మాత్రం తెదేపా అభ్యర్థి కంటే వైకాపా అభ్యర్థి 1,820 మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా కలిపితే వైకాపా కంటే తెదేపా 7,543 ఓట్లు అధికంగా సాధించింది.

* మూడు నియోజకవర్గాల పరిధిలో చెల్లిన ఓట్లలో పీడీఎఫ్‌కు 13.84%, భాజపాకు 3.70% ఓట్లే దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని