వైకాపా పతనం ఆరంభం

రాష్ట్రంలో వైకాపా పతనం ఆరంభమైందని, అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నాంది అని తెదేపా నేతలు అన్నారు.

Published : 19 Mar 2023 04:52 IST

విశాఖలో తెదేపా నేతల సంబరాలు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా పతనం ఆరంభమైందని, అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నాంది అని తెదేపా నేతలు అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఘన విజయం సాధించడంతో శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘వైకాపా అధికారంలోకి వచ్చాక ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో అక్రమాలతో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల నమోదు నుంచి రకరకాలు అక్రమాలకు పాల్పడ్డారు. ఓటుకు నోటు, వెండి బిస్కెట్ల పంపిణీకి తెరతీశారు. అయినా ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైకాపాకు ఓటుతో గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికలను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించి అద్భుత విజయం అందుకున్నాం’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసగించాలనుకున్న జగన్‌కు ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఈ ఎన్నికలో గట్టి సమాధానం చెప్పారన్నారు. నాలుగేళ్ల పాటు పరిశ్రమల స్థాపనకు ఎటువంటి ప్రయత్నం చేయని జగన్‌.. ఎన్నికల ముందు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు పేరుతో మోసం చేయాలని చూసినా ప్రజలు దాన్ని గ్రహించి, ఓట్ల రూపంలో తీర్పు చెప్పారని పేర్కొన్నారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజధాని ముసుగులో వైకాపా నేతలు విశాఖలో చేసిన అక్రమాలు, దుర్మార్గాలను  పట్టభద్రులు గుర్తుపెట్టుకొని వారికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు. మూడు రాజధానులనే ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో పులివెందుల సహా రాష్ట్రమంతటా తెదేపా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

నా గెలుపు మార్పు తెస్తుంది

ఎమ్మెల్సీగా ఎన్నికైన చిరంజీవిరావు మాట్లాడుతూ ‘34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించిన తెదేపా అధినేత చంద్రబాబుకు నా కృతజ్ఞతలు. రాజకీయాల్లో నా గెలుపు మంచి మార్పు తెస్తుందని భావిస్తున్నా. ఎవరు ఎంతగా ప్రలోభపెట్టినా, వేధించినా నన్ను గెలిపించిన పట్టభద్రులకు, నా విజయానికి కృషి చేసిన తెదేపా శ్రేణులకు నా శిష్య బృందానికి కృతజ్ఞతలు. విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై మండలిలో బలంగా మాట్లాడతా’ అని పేర్కొన్నారు.  మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ, తెదేపా పరిశీలకులు దామచర్ల సత్య, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.


ఎమ్మెల్సీగా చిరంజీవిరావుకు ధ్రువపత్రం అందజేత

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు శనివారం తెల్లవారుజామున 2 గంటల వరకు సాగింది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి తుది అనుమతి తీసుకొని శనివారం తెల్లవారుజామున 3 గంటలకు విజేత పేరును ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్సీగా విజయం సాధించినట్లు తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని