దళిత యువకుడిపై దాడి అమానుషం

దళిత యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలని శనివారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి.

Published : 19 Mar 2023 04:52 IST

సీఐ క్షమాపణ చెప్పాలని తెదేపా నిరసన

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: దళిత యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలని శనివారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో అమలాపురంలోని గడియారస్తంభం కూడలిలో తెదేపా శనివారం విజయోత్సవాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు భారీ కేకు కోసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. పట్టణ సీఐ డి.దుర్గాశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తెదేపా నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విజయోత్సవాల్లో బాణసంచా కాల్చుతున్న అల్లవరం మండల తెదేపా కార్యకర్త, దళిత యువకుడైన బుంగా వెంకటేశ్వరరావుపై సీఐ చేయిచేసుకున్నారని తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఐ క్షమాపణలు చెప్పాలని వర్షంలోనే రహదారిపై బైఠాయించారు. సీఐ, పోలీసులు సర్దిచెప్పి వివరణ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని