Bhumireddy Ramgopal Reddy: పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణం

ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణాన్ని వదిలి తెదేపా విజయాన్ని చేజిక్కించుకుంది.

Updated : 19 Mar 2023 07:16 IST

ఈనాడు డిజిటల్‌, కడప: ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణాన్ని వదిలి తెదేపా విజయాన్ని చేజిక్కించుకుంది. గతంలో పార్టీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటెక్‌ రవిని పోటీకి పెట్టి వైకాపా అభ్యర్థి దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయం సాధించింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర స్థానం నుంచి  పులివెందుల ప్రాంతవాసి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని బరిలో నిలిపి గెలిచింది. అధికార వైకాపా వాలంటీర్ల ద్వారా భారీగా బోగస్‌ ఓట్లను నమోదు చేయించినప్పటికీ ఫలితం సాధించలేకపోయింది. నగదు లావాదేవీలు నడిచినప్పటికీ నిష్ఫలమైంది. రెండో ప్రాధాన్య ఓటు పరస్పరం బదిలీ చేసుకునేలా తెదేపా అధినేత చంద్రబాబు వామపక్షాల అభ్యర్థులతో ఒప్పందానికి వచ్చారు. ఈ నిర్ణయం పశ్చిమ రాయలసీమలో సత్ఫలితాలనిచ్చింది. తెదేపా అభ్యర్థి గెలుపు ప్రకటనకు ముందే శనివారం పులివెందులలో భారీగా సంబరాలు చేసుకున్నారు. అన్ని మండలాల్లో భారీగా టపాకాయలు కాల్చి తెదేపా శ్రేణులు ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ సందర్భంగా తొండూరు మండలం ఇనగనూరులో రెండు వర్గాలు రాళ్ల దాడులు చేసుకోగా, వైకాపాకు చెందిన ముగ్గురు, తెదేపా వర్గీయులు ఇద్దరు గాయపడ్డారు. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోనూ వివిధ ప్రాంతాల్లో తెదేపా సంబరాలు మిన్నంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని