MLC Elections: అధికార పక్షానికి దిమ్మతిరిగే తీర్పు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురవడం, తెదేపా అనూహ్య విజయం సాధించడం రాజకీయ నేతల్లోనే కాదు.. మేధావులు, సామాన్యుల్లోనూ ఎన్నో విశ్లేషణలను తెరపైకి తెచ్చింది.

Updated : 19 Mar 2023 08:25 IST

వైకాపా ప్రభుత్వ పనితీరుపై ఇది రెఫరెండమే
అధికార దాష్టీకాన్ని, ధనబలాన్ని తిప్పికొట్టిన పట్టభద్ర ఓటర్లు
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు
ఈనాడు - అమరావతి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురవడం, తెదేపా అనూహ్య విజయం సాధించడం రాజకీయ నేతల్లోనే కాదు.. మేధావులు, సామాన్యుల్లోనూ ఎన్నో విశ్లేషణలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. ప్రతిపక్షాలనూ, ప్రశ్నించినవారినీ అక్రమ కేసులు, అరెస్టులతో భయపెడుతూ.. వైకాపా సాగిస్తున్న అరాచక పాలనకు ఈ తీర్పు చెంపపెట్టులా నిలిచింది. ‘పాలకులు భావిస్తున్నట్లుగా ప్రజలు అమాయకులో, తెలివితక్కువవారో కాదని.. అవకాశం కోసం ఎదురు చూసి కీలెరిగి వాత పెడతారని రుజువైంది. ప్రజల్లో మార్పు అంటూ మొదలైతే ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా అన్ని చోట్లా వారి స్పందన ఒకేలా ఉంటుందని నిరూపణైంది’అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘సుపరిపాలనతో ప్రజల మనసులు గెలుచుకోవాలే తప్ప.. ‘వైనాట్‌ 175’ అన్న అహంభావం ప్రదర్శిస్తే జనం స్పందన కూడా అలాగే ఉంటుందని తేలిపోయింది. మౌలిక వసతులు, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పనులేమీ చేయకుండా.. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల వంటి అస్తవ్యస్త నిర్ణయాలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో రుజువైంది’ అని రాయలసీమ ప్రాంతానికి చెందిన తెదేపా సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. ‘మేం ధైర్యంగా నిలబడితే చాలు.. జనం అండగా ఉంటారన్న భరోసాను ఈ ఫలితాలు ఇచ్చాయి’ అని మరో తెదేపా నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఊహించని ఝలక్‌ ఇస్తే... ప్రధాన ప్రతిపక్షంలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేశాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా వ్యతిరేకత మొదలైతే ఒక ప్రాంతంతో ఆగదని, అన్నిచోట్లా ఒకేలా ప్రతిఫలిస్తుందని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ చివర ఉన్న ఉత్తరాంధ్ర నుంచి ఈ మూల ఉన్న రాయలసీమ వరకు ప్రభుత్వ వ్యతిరేకత ఒకేరకంగా పెల్లుబకడం ఇందుకు నిదర్శనం. ‘పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాదరావు వంటి బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులే ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఒకసారి.. విశాఖే అసలు రాజధాని అని మరోసారి వైకాపా నాయకులు ఎంత ఊదరగొట్టినా, త్వరలోనే తానూ విశాఖకు మకాం మారుస్తానని ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతున్నా.. ఈ ప్రాంత ప్రజలు ఏ మాత్రం ఖాతరు చేయలేదు’ అని ఉత్తరాంధ్రలోని ఓ తెదేపా నేత పేర్కొన్నారు. విశాఖను రాజధాని చేస్తే ఒనగూరేదేంటో తెలియదు గానీ రుషికొండపై కళ్ల ముందే కనిపిస్తున్న విధ్వంసం, వైకాపా నాయకుల భూ దోపిడీలు, అక్రమాలు, అరాచకాల వంటివి... వైకాపా ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర వాసుల్లో తీవ్ర వ్యతిరేకతను పోగు చేశాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అది పక్కాగా ప్రతిఫలించింది. 

సీమ వాసులకూ చిర్రెత్తుకొచ్చింది!

వైకాపా అరాచక పాలన.. తన కంచుకోటలుగా భావించే రాయలసీమ జిల్లాల ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తిని పోగుచేసిందనడానికి ఈ ఫలితాలు ఓ సూచికలా నిలిచాయి. ‘తెదేపా గెలుపుతో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోని పూల అంగళ్ల సెంటర్‌లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటేనే.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్థమవుతోంది. రాయలసీమ జిల్లాల్లో అధికార పార్టీ నాయకుల అక్రమాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో... ఆయన పర్యటనకే అడ్డంకులు సృష్టించడం, తెదేపా నాయకులపై దాడి చేసి వారిపైనే అక్రమంగా కేసులు పెట్టడం వంటి అరాచకాల్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టారు’ అని అనంతపురం జిల్లాకు చెందిన ఓ తెదేపా నేత విశ్లేషించారు.

ధనబలంతో గెలవగలమని విర్రవీగితే..

అర్థబలం, అంగ బలాలతో ఏ ఎన్నికల్లోనైనా గెలవగలమన్న అధికార పార్టీ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టని నిరూపణైంది. ఉత్తరాంధ్ర తెదేపా అభ్యర్థి చిరంజీవిరావు మధ్యతరగతి వర్గానికి చెందిన సాధారణ అధ్యాపకుడు. ఆయనపై పోటీ చేసిన సుధాకర్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌. ధనవంతుడు. తూర్పు రాయలసీమ తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ ఉన్నత విద్యావంతుడు. ఇంజినీరింగ్‌ కళాశాల నడుపుతున్నారు. ఆయనపై పోటీ చేసిన.. పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆర్థికంగా బలవంతుడు. 2014 ఎన్నికల్లో నకిలీ లేబుల్స్‌, హోలోగ్రామ్స్‌ పెట్టి కల్తీమద్యం తయారు చేసి, నెల్లూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకూ సరఫరా చేశారన్న అభియోగంపై నెల్లూరులో నమోదైన కేసులో ఆయన ఏ3గా ఉన్నారు. పశ్చిమ రాయలసీమలో గెలిచిన తెదేపా అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డి ఆర్థికంగా అతి సామాన్యుడు. ఆయనపై పోటీ చేసిన వెన్నపూస రవీంద్రరెడ్డి.. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి కుమారుడు. ఆర్థికంగా బలవంతుడు. ధనబలమున్న వైకాపా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి, ప్రలోభపెట్టి గెలవాలని చూశారన్న ఆరోపణలున్నాయి. అలాంటివారిని తోసిరాజని సామాన్యులైన తెదేపా అభ్యర్థులను గెలిపించడం పట్టభద్రుల విజ్ఞతకు నిదర్శనం.

అహంభావాన్ని ప్రజలు సహించలేదు!

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అంగ, అర్థ, అధికార బలాల్ని ప్రయోగించి, ప్రత్యర్థుల్ని బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, ఓటర్లను భయపెట్టి, దొంగ ఓట్లు వేయించి, ఫలితాల్ని తారుమారు చేసి సాధించిన విజయాలు.. అధికార పార్టీ నాయకుల్లో మితిమీరిన విశ్వాసానికి కారణమయ్యాయి. దానిలోంచి వచ్చిందే ‘వైనాట్‌ 175’! ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి పదేపదే వస్తున్న మాట ఇది. కుప్పం నియోజకవర్గంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం కాబట్టి, ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్నీ గెలిచేయగలమన్నది ఆయన ధీమా. ఇటీవల కాలంలో ఆయన వచ్చే ఎన్నికలు పేదలకూ, పెత్తందారులకూ మధ్య అంటూ ప్రజల్లో వర్గ వైషమ్యాల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. ముఖ్యమంత్రి నమ్మకానికి, వైకాపా నాయకుల అతి విశ్వాసానికి పెద్ద ఎదురుదెబ్బ’ అని తెదేపా సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. 

విష ప్రచారాల్ని విశ్వసించలేదు

విస్తృతంగా కన్సల్టెంట్లను మోహరించి, సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారాన్ని హోరెత్తించిన అధికార పార్టీకి ఈ ఫలితాలు ఊహించని దెబ్బే. అసత్యాల్ని, అర్ధసత్యాల్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోగలమని భావిస్తే ప్రజలు వివేచనతో తిప్పికొడతారనడానికి ఇదే నిదర్శనం. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చేయడం, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, చదువుకున్నవారంతా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సిన పరిస్థితులు తలెత్తడం వంటి పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అదే ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

శాంతిభద్రతల వైఫల్యం, అక్రమ కేసులతో విసుగెత్తి..

శాంతిభద్రతల నిర్వహణలో వైకాపా ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది.  అరాచక శక్తులు పేట్రేగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వమే అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజల్ని భీతావహుల్ని చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎవరూ ప్రశ్నించడానికి, నోరెత్తడానికి లేదు. సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టినా, ఎవరో పెట్టిన పోస్ట్‌ను ఫార్వార్డ్‌ చేసినా కేసులు బనాయించింది. వయోవృద్ధుల్ని కూడా విచారణ పేరుతో పిలిపించి వేధించింది. ప్రతిపక్ష నాయకులపై కేసులు, అక్రమ అరెస్టులు సరేసరి. ‘వాలంటీర్లతో ఎక్కడికక్కడ నిఘా పెట్టడం, తమ కదలికల్ని డేగకళ్లతో పరిశీలించడం వంటివి ప్రజల్ని తీవ్ర అసహనానికి గురిచేశాయి. అందుకే ఈ ఫలితాలు’ అని తెదేపా సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.

పోలీసులు, అధికారులకు కనువిప్పు కలిగేనా!

నాలుగేళ్లుగా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడుతూ, దాదాపు ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న కొందరు పోలీసులు, అధికారులకు ఈ ఫలితాలు కనువిప్పు కావాలి. ఎందుకంటే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, విధి నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించకపోతే రేపు పరిస్థితులు మారినప్పుడు ఇబ్బందులు తప్పవని ఈ ఫలితాలు వారికి హెచ్చరికలు జారీ చేసినట్లే.


ముమ్మాటికీ ప్రజా తీర్పే!

వైకాపా నాయకులు అవునన్నా కాదన్నా... మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వం పనితీరుపై ప్రజా తీర్పేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ఎన్నికలు కచ్చితంగా సెమీ ఫైనల్సేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పట్టభద్రులే కావొచ్చు. కానీ వారంతా సమాజంలోని ఒక వర్గానికి మాత్రమే ప్రతినిధులు కాదు. వారిలో వివిధ కులాలు, మతాలు, సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందినవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, నిరుద్యోగులు, పీజీ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. పైగా 108 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 7.16 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. దీన్ని భారీ నమూనా (శాంప్లింగ్‌)తో నిర్వహించిన విస్తృత  సర్వేలా భావించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని