తూర్పు రాయలసీమలో తెదేపా విజయదుందుభి

తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడింది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుంచే తెదేపా జోరు కనిపించింది.

Published : 19 Mar 2023 04:52 IST

వైకాపా అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిపై 34,110 ఓట్ల ఆధిక్యంతో శ్రీకాంత్‌ గెలుపు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడింది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుంచే తెదేపా జోరు కనిపించింది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ దూసుకెళ్లారు. విజయానికి అవసరమైన కోటా ఓట్లు (1,24,181) రాగానే తెదేపా అభ్యర్థి గెలిచారని అధికారులు ప్రకటించారు. ఆ సమయానికి వైకాపా అభ్యర్థికి 90,071 ఓట్లు వచ్చాయి. దీంతో 34,110 ఓట్ల ఆధిక్యం సాధించారని వెల్లడించారు. శ్రీకాంత్‌ గెలుపును శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఏఆర్వో వెంకటేశ్వర్‌ ప్రకటించారు. అప్పటినుంచి ఉదయం ఆరింటి వరకు అభ్యర్థి శ్రీకాంత్‌తోపాటు పార్టీ నాయకులు చిత్తూరులోని ఎస్వీసెట్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రం లోపల, పార్టీ కార్యకర్తలు బయట పడిగాపులు కాశారు. డిక్లరేషన్‌ పత్రం ఇచ్చేంతవరకూ కదిలేది లేదని వారు అధికారుల ఎదుట స్పష్టం చేశారు. విజయాన్ని ధ్రువీకరిస్తూ శనివారం ఉదయం ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేయడంతో ఆర్వో హరినారాయణన్‌ వచ్చి సదరు పత్రాన్ని అభ్యర్థికి అందజేశారు. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ తెదేపా జిల్లా కార్యాలయానికి చేరుకున్నాయి.

వైకాపా- పీడీఎఫ్‌ మధ్యే పోటీ అని భావించినప్పటికీ..

నామినేషన్ల పర్వం నుంచి ప్రధాన పోటీ వైకాపా అభ్యర్థి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పీడీఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి మధ్యే ఉంటుందని భావించారు. కౌంటింగ్‌ తొలి రౌండ్‌లో తెదేపా అభ్యర్థి శ్రీకాంత్‌కు శ్యామ్‌ప్రసాద్‌పై అనూహ్యంగా 2,484 ఓట్ల ఆధిక్యం లభించింది. శ్యామ్‌ప్రసాద్‌, శ్రీకాంత్‌ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిని తలకిందులు చేస్తూ ప్రతి రౌండ్‌లోనూ తెదేపా అభ్యర్థి సంపూర్ణ మెజారిటీ సాధించి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 20వ రౌండ్‌లో ఎలిమినేట్‌ అయిన మీగడ వెంకటేశ్వరరెడ్డి 38,001 తొలి ప్రాధాన్య ఓట్లు రాగా, అందులోని 20,094 ఓట్లను లెక్కించాక శ్రీకాంత్‌ గెలుపు ఖరారైంది. మిగిలిన 17,907 ఓట్లూ లెక్కించి ఉంటే తెదేపా ఆధిక్యం మరింత పెరిగి ఉండేదని పార్టీ నాయకులు అంటున్నారు. 

బలమైన పునాదిపై కంచర్ల గెలుపు

కంచర్ల శ్రీకాంత్‌.. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని పేరు. తెదేపా అభ్యర్థిగా ప్రకటించాక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. బోగస్‌ ఓట్లు, విచ్చలవిడి నగదు పంపకాలను నమ్ముకుని ఎన్నికల్లో గెలవాలని అధికార వైకాపా ప్రయత్నిస్తోందన్న విమర్శలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మధ్య శ్రీకాంత్‌ ఎంత మేర పోటీనిస్తారనే సందేహాలు ఏర్పడ్డాయి. కౌంటింగ్‌కు ముందు వరకే ఈ సందిగ్ధత కనిపించింది. ఆ తరువాత పూర్తి అనుకూల పవనాలే వీచాయి. బలమైన పునాదిపై శ్రీకాంత్‌ విజయబాట వేసుకున్నారు. తెదేపా శ్రేణులను సమన్వయం చేసుకోవడం తొలి మెట్టుగా నిలిచింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుగా మలచుకోవడంలో సఫలమయ్యారు. పదో తరగతి, ఇంటర్‌ చదివినవారు నమోదయ్యారంటూ పట్టభద్రుల ఓటరు జాబితాపై ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంలో వారిలో కొందరిని జాబితానుంచి తొలగించేలా చేశారు. అర్హుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా తెదేపాకు మద్దతుగా నిలిచేవారిని మరింత చైతన్యపరిచి పోలింగ్‌ కేంద్రానికి వచ్చేలా కృషి చేశారు. పోలింగ్‌ రోజున పట్టభద్రులు కానివారు వచ్చి ఓటేస్తున్నది. గమనించడంలోనూ ఆయన, మద్దతుదారులు పహారాకాసి కృతకృత్యులయ్యారు. పుంగనూరు వంటి నియోజకవర్గాల్లోనూ సమర్థులైన ఏజెంట్లను నియమించుకోగలిగారు. బోగస్‌ ఓట్లు ఎక్కువగా పడనీయకుండా జాగ్రత్తలు తీసుకుని విజయాన్ని దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని