7 ప్రాధాన్యతలనూ స్పష్టంగా ఇవ్వాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో వైకాపా మరింత అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల కోటా శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల విషయంలో అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై పక్కాగా అవగాహన కల్పిస్తోంది.

Published : 19 Mar 2023 04:52 IST

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార పార్టీ

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో వైకాపా మరింత అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల కోటా శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల విషయంలో అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై పక్కాగా అవగాహన కల్పిస్తోంది. మూడు నాలుగు రోజులుగా ఈ ఎన్నికపై భేటీలు నిర్వహించింది. శనివారం ఓ సారి మాక్‌ పోలింగ్‌నూ నిర్వహించింది. మధ్యాహ్నం శాసనసభ వాయిదాపడ్డాక అసెంబ్లీ కమిటీ హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అంతకుముందు అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్‌పై మాట్లాడుకోవడం కనిపించింది. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే సరిపోతుందని కొందరంటే.. కాదు.. బ్యాలెట్‌పైన 7 ప్రాధాన్యత ఓట్లనూ మార్క్‌ చేయాల్సిందేనని మరికొందరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వైకాపా నుంచి ఏడుగురు అభ్యర్థులు, తెదేపా నుంచి ఒకరు బరిలో ఉన్నారు. దీనికి అనుగుణంగానే మాక్‌ పోలింగ్‌లో ఎమ్మెల్యేలు 7 ప్రాధాన్యతలను నమూనా బ్యాలెట్‌పై నమోదు చేశారు. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి గరిష్ఠంగా 22మంది చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించారు. వారిలో కనీసం ఇద్దరు మంత్రులు ఉండేలా చూశారు. ఈ మంత్రులు, మరో సీనియర్‌/చురుగ్గా ఉండే ఎమ్మెల్యేకు సమన్వయ బాధ్యత అప్పగించారు.

22న మరో భేటీ: ఈ నెల 23న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. దానికి ముందు రోజు 22న రాత్రి విజయవాడలో వైకాపా ఎమ్మెల్యేలందరితో భేటీ నిర్వహించనున్నారు. అందులో మరోసారి అభ్యర్థుల వారీగా కేటాయించిన ఎమ్మెల్యేల బృందాలను సరిచూడనున్నారు. ఆ భేటీకి అందరు ఎమ్మెల్యేలూ హాజరయ్యేలా సమన్వయ బృందం ఏర్పాట్లు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు