గుంతలమయంగా రోడ్లు.. సౌకర్యాల్లేని జగనన్న కాలనీలు

క్షేత్రస్థాయిలో సమస్యలు చూడలేక అధికారపక్ష సభ్యులే నోరువిప్పక తప్పడం లేదు. కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు రోడ్ల దుస్థితి, జగనన్న కాలనీల్లో ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వినిపిస్తున్నారు.

Updated : 19 Mar 2023 12:05 IST

శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేల ప్రస్తావన

ఈనాడు, అమరావతి: క్షేత్రస్థాయిలో సమస్యలు చూడలేక అధికారపక్ష సభ్యులే నోరువిప్పక తప్పడం లేదు. కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు రోడ్ల దుస్థితి, జగనన్న కాలనీల్లో ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వినిపిస్తున్నారు. మంత్రులకు సూచనలు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సభలో సమస్యలు ప్రస్తావిస్తుండటంతో మంత్రులకు మింగుడుపడటం లేదు. శాసనసభలో శనివారం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల ఆదాయ, వ్యయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వారి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు వివరించారు.

* రోడ్లు, భవనాలశాఖకు సంబంధించిన అంశంపై ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని చెబుతూనే.. తన నియోజకవర్గంలోని చోడవరం-ఎ.కోడూరు వయా గవరవరం రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోడ్డులో పడిన గోతులు పూడ్చేలా పనులు చేపట్టాలని కోరారు. యలమంచిలి పైవంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో దిష్టిబొమ్మలా ఉందని సంబంధిత మంత్రికి వివరించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినా.. ‘13 జిల్లాలు’ అని ధర్మశ్రీ ప్రస్తావించడం గమనార్హం.

* జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో జాప్యమవుతోందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సభలో తెలిపారు. ఆయన మాటలను సభాపతి తమ్మినేని కూడా సమర్థించారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్‌కు సూచించారు. తన నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి భూ సేకరణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మంత్రిని కోరారు.

9 పద్దులు ఏకగ్రీవం..

ప్రభుత్వశాఖల ఆదాయ, వ్యయాలకు సంబంధించి మొత్తం 9 పద్దులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం, మహిళాభివృద్ధి, స్త్రీ సంక్షేమశాఖలపై చర్చ జరిగింది. మిగిలిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లుగా భావించాలన్న సభాపతి విజ్ఞప్తిని సభ్యులు ఆమోదించారు. మంగళగిరిలోని ఏపీఎస్‌పీ ఆరో బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నను వాయిదా వేసినట్లు సభాపతి ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు