అవినాష్‌రెడ్డిని కాపాడటానికి కాదని చెప్పగలరా?

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌ అత్యవసరంగా దిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని తెదేపా నేతలు ప్రశ్నించారు.

Published : 19 Mar 2023 04:52 IST

దిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి ఏం సాధించారు?
తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రశ్నలు
అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌ అత్యవసరంగా దిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని తెదేపా నేతలు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని కాపాడటానికి కాదని చెప్పగలరా అని సవాలు విసిరారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వెలుపల ఉన్న తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ వద్ద శనివారం నిరసన తెలిపారు. ‘దిల్లీ వెళ్లి పోలవరానికి నిధులు ఎంత తెచ్చారు?’, ‘అప్పర్‌భద్ర ఆపారా?’, ‘విశాఖ రైల్వే జోన్‌ తెచ్చారా?’ అని రాసి ఉన్న ప్లకార్డులతో అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసమే జగన్‌ దిల్లీ వెళ్లారని బుగ్గన రాజేంద్రనాథరెడ్డి శాసనసభలో ఆవుకథ చెప్పారని ఎద్దేవా చేశారు. ‘నాకు తెలిసినంత వరకు సీఎం హోదాలో జగన్‌ 18 సార్లు దిల్లీ వెళ్లారు. ఏనాడూ దానిపై మేం సభలో మాట్లాడలేదు. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా హుటాహుటిన వెళ్లి ఏం చేశారో చెప్పాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాం. దానికి సమాధానం చెప్పకుండా బుగ్గన మమ్మల్ని తప్పుపట్టారు. జగన్‌ దిల్లీ పర్యటనలన్నీ కేసుల మాఫీ కోసమే. ప్రస్తుత పర్యటన వివేకా హత్యకేసు నుంచి బయటపడటానికే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే కేంద్రప్రభుత్వ పెద్దలు ఎవరితో ఏం మాట్లాడారు? ఎన్ని నిధులు సాధించారు? ఏ సమస్యల్ని పరిష్కరించారనే విషయాలు వెల్లడించాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

పోలవరం కోసమైతే అంబటి ఎందుకు వెళ్లలేదు?

పోలవరంపై ప్రధానితో చర్చించడానికే జగన్‌ దిల్లీ వెళ్లారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అలాంటప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఆయన్ను, నీటిపారుదలశాఖ అధికారుల్ని ఎందుకు తీసుకెళ్లలేదు? ఈ ప్రశ్నను అసెంబ్లీలో అడిగితే అంబటి నీళ్లు నమిలారు. 

 దీపక్‌రెడ్డి, ఎమ్మెల్సీ

ప్రజలకు ఏం చేశారో చెప్పాలి

సీఎం దిల్లీ పర్యటనపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలతో పిచ్చి విమర్శలు చేయించడం ఆపి జగన్‌ నోరు విప్పాలి. తెదేపా వారిని తిట్టడంపై చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పెద్దలు చూపడం లేదు.

 డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే

విర్రవీగితే ఫలితం ఇలాగే ఉంటుంది

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా గెలుపు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇక పనికిరాదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారని ఈ ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి.

 ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని