స్మార్ట్‌మీటర్లా.. ఉరితాళ్లా?

వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్ల వ్యవహారం రాష్ట్ర శాసనసభను ఆదివారం కుదిపేసింది. దీనిపై చర్చ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపిన 11 మంది తెదేపా సభ్యులను సభాపతి ఒక రోజు సస్పెండ్‌ చేశారు.

Updated : 20 Mar 2023 07:29 IST

రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా సభ్యుల నినాదాలు
11 మందిని ఒక రోజు సస్పెండ్‌ చేసిన సభాపతి తమ్మినేని
తప్పుడు ప్రచారం   చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

ఈనాడు, అమరావతి: వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్ల వ్యవహారం రాష్ట్ర శాసనసభను ఆదివారం కుదిపేసింది. దీనిపై చర్చ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపిన 11 మంది తెదేపా సభ్యులను సభాపతి ఒక రోజు సస్పెండ్‌ చేశారు. దీనికిముందు... స్మార్ట్‌మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా మారాయని, అందులో రూ.6వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. శాసనసభ ఆదివారం కొలువుదీరగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. వ్యవసాయ పంపుసెట్లకు అమర్చనున్న స్మార్ట్‌ మీటర్ల వివరాలు చెప్పాలని తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌, బెందాళం అశోక్‌, మంతెన రామరాజు అడిగిన ప్రశ్నకు ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు 18.57 లక్షల స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్ల కొనుగోలు, నిర్వహణకు రూ.3,406.14 కోట్లు, అనుబంధ పరికరాలకు మరో రూ.2,286.22 కోట్లు అవుతుంది. రైతుల విద్యుత్తు బిల్లులకు డబ్బులను డీబీటీ ద్వారా వారి ఖాతాలకు జమచేస్తాం. పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో అమలుచేయగా 33.75% వినియోగం తగ్గింది. స్మార్ట్‌మీటర్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’ అన్నారు.

స్మార్ట్‌మీటర్లు వద్దని విజయానంద్‌ లేఖ రాశారు: అచ్చెన్నాయుడు

తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ హయాంలో ఒక హార్స్‌పవర్‌ రూ.50కి ఇచ్చారు. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య ప్రభుత్వాల హయాంలో రైతులకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేశారు. ఇదే విధానాన్ని తెదేపా ప్రభుత్వం కొనసాగించింది. ఈ ప్రభుత్వమే స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేస్తోంది. ఇవి అక్కర్లేదని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ డిస్కంలకు లేఖ రాశారు. రాష్ట్రంలో పేర్కొన్న ధర మహారాష్ట్రలో ఖరారుచేసిన ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువనీ అన్నారు. అయినా సొంత మనుషులకు టెండర్లు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘విజయానంద్‌ రాసిన లేఖలో అన్ని రకాల మీటర్లనూ పరిశీలించి చర్యలు తీసుకోవాలనే సూచించారు. ఇందులో తప్పేముంది? స్మార్ట్‌మీటర్ల కోసం 2021లో రూ.6,480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచాం. ఖర్చు ఎక్కువని టెండర్లు రద్దు చేశాం. 2022లో రూ.5,692.35 కోట్లతో టెండర్లు పిలిచాం. ధర ఇంకా తగ్గేలా చర్చిస్తున్నాం. దీన్ని ఎవరికో ఇచ్చేశామని అచ్చెన్నాయుడు చెప్పేదాంట్లో వాస్తవం లేదు’ అన్నారు.

వైకాపా నేతలకు మైండ్‌ బ్లాంక్‌

అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా కన్నబాబు జోక్యం చేసుకోబోయారు. దీంతో.. జగన్‌ది జైలుపార్టీ అన్నారని, మీరు మాట్లాడకూడదని తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ... సొంతపార్టీపై, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యల గురించి అచ్చెన్నాయుడు ఏమంటారని ప్రశ్నించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోయేసరికి... మైండ్‌ బ్లాంక్‌ అయి వైకాపా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ దమ్ముంటే రాజీనామా చేసి, టెక్కలి నుంచి మళ్లీ పోటీచేయాలని అచ్చెన్నాయుడికి సవాలు విసిరారు. ఇంతలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిందని సభాపతి తమ్మినేని సీతారాం చెబుతూ తేనీటి విరామం ప్రకటించారు.

చర్చ కొనసాగించాలని పోడియం వద్ద నినాదాలు

సభ మళ్లీ కొలువుదీరగానే.. స్మార్ట్‌మీటర్లపై చర్చను కొనసాగించాలని సభాపతిని తెదేపా సభ్యులు కోరారు. ప్లకార్డులతో పోడియం వద్దకు వెళ్లారు. కాగితపు ముక్కలను చించి విసరగా.. అవి సభాపతి ముందు పడ్డాయి. సీట్లలో కూర్చోవాలని, ముగిసిన చర్చపై కొనసాగింపునకు అవకాశం లేదని సభాపతి స్పష్టంచేశారు. అయినా తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో మంత్రులు శాఖలవారీగా గ్రాంట్లను ప్రతిపాదిస్తూ సభ అనుమతిని కోరారు. చివరికి 11 మంది తెదేపా సభ్యులను ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. కాసేపటి తర్వాత వారంతా సభ నుంచి బయటకు వెళ్లారు. వీరిలో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఏలూరు సాంబశివరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవాని, గణబాబు, మంతెన రామరాజు, బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహనరావు, గొట్టిపాటి రవికుమార్‌, వెలగపూడి రామకృష్ణ ఉన్నారు. రోజూ సస్పెన్షన్‌ కోసమే తెదేపా సభ్యులు ఆందోళన చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సభ్యులు పోడియం వద్దకు రావడం తమకు అవమానంగా ఉందని వైకాపా సభ్యుడు సుధాకర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని