Chandrababu: ఇది ప్రజల తిరుగుబాటు.. తెదేపా అధినేత చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పును కేవలం ప్రజల్లో వచ్చిన మార్పుగా కాకుండా, వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తిరుగుబాటుగా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
జగన్ పనైపోయింది.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవరు
జనం తమకేం కావాలో స్పష్టంగా చెప్పారు
ఈనాడు - అమరావతి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పును కేవలం ప్రజల్లో వచ్చిన మార్పుగా కాకుండా, వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తిరుగుబాటుగా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలను సీఎం జగన్‌కు, అయిదు కోట్ల ప్రజలకు మధ్య పోరాటంగా అభివర్ణించారు. జగన్ పనైపోయిందని, ఇక ఏ ఎన్నికల్లోనూ వైకాపా గెలిచే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.. తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు. ఓటుహక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో, ఓటు అమ్ముకుని బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది’- అంటూ బి.ఆర్.అంబేడ్కర్ చెప్పిన మాటల్ని గుర్తుచేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసి, అంబేడ్కర్ స్ఫూర్తిని నిలబెట్టిన ఘనత పట్టభద్రులకు దక్కుతుంది. ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా పేద ప్రజలందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రజలు తమకేం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు. ఉగాది పంచాంగాన్ని రెండు రోజుల ముందే చెెప్పారు. ఇదేదో ఒక వ్యక్తి, వర్గం స్పందన కాదు. ఈ రోజు తెదేపాకు పడిన ఓటు వెనుక... ఒక నిరుద్యోగి ఆవేదన, ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసం చేసిన ఆలోచన, ఒక విద్యావంతుడు రాష్ట్రం కోసం పడిన తపన, ఒక ప్రభుత్వోద్యోగి వేదన.. అన్నీ ఉన్నాయి. పెరిగిన ధరలతో బతుకు భారమైన సామాన్యుడి కష్టం ఉంది. ప్రభుత్వ అరాచకాలతో బతుకే భయంగా మారిన సగటు మనిషి ఆవేదన ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విజయంతో తెదేపాపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ‘ప్రజల నమ్మకాన్ని నిజం చేయాలంటే మనం ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి వెళ్లి, వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి కార్యకర్త, నాయకుడు ఇంకా కష్టపడి పనిచేయాలి’ అని పార్టీశ్రేణులకు సూచించారు.
గాలికి వచ్చి గాలికే పోయే పార్టీ
‘ఈ నాలుగేళ్లలో జగన్ చేసిన అరాచకం, విధ్వంసం, రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. కొన్ని పార్టీలు గాలికి వచ్చి, గాలికే పోతాయి. వైకాపా కూడా అలాంటిదే. జగన్ మోసాలు చేయడంలో దిట్ట. తెదేపాది జనబలం. జగన్‌ది ధనబలం, రౌడీయిజం. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఎన్నికా జరగలేదు. అంతా ఎంపికే. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడనన్ని దుర్మార్గాల్ని ఈ నాలుగేళ్లలో చూశాను’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైకాపా ఎన్ని అరాచకాలు చేసినా... ప్రజలు తెదేపా వెంటే
‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు చేయని అరాచకాల్లేవు. ఓటర్లకు డబ్బులు, వెండి ఆభరణాలు ఇచ్చారు. ప్రచారం చేయకుండా తెదేపాను అడ్డుకున్నారు. అయిదో తరగతి చదువుకున్న వాళ్లనూ ఓటర్లుగా చేర్చారు. ప్రధానమంత్రి, సీజేఐ, ప్రధాన ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ... ఎన్నికల కమిషన్ సభ్యుల్ని ఎంపికచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. మన రాష్ట్రంలో మాత్రం ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించేందుకు, దొంగ ఓట్లను, ధనప్రభావాన్ని అరికట్టడానికే పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది’ అని చంద్రబాబు మండిపడ్డారు.
జగన్‌రెడ్డిని సంతోషపెట్టేందుకు అధికారుల అరాచకాలు
తెదేపా అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి గెలిచినా.. అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఇవ్వకుండా, రాత్రంతా హైడ్రామాలు ఆడారని, జగన్‌రెడ్డిని సంతోషపెట్టడానికి అరాచకాలకు ఒడిగట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ‘తెదేపా అభ్యర్థి మెజారిటీలో ఉన్నారని అప్పటికప్పుడు పులివెందుల నుంచి అనంతపురానికి మనుషుల్ని పంపించి కౌంటింగ్ కేంద్రంలో గొడవచేయాలని చూశారు. అక్కడి ఎస్పీ ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడరు. తెదేపా అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా... అధికారులపై ఒత్తిడి చేసి, ఫలితాలు ప్రకటించకుండా అడ్డుకున్నారు. రౌండు రౌండుకీ రీకౌంటింగ్ అడగాలన్న ఇంగితజ్ఞానం వైకాపా నాయకులకు లేదు. ఓడిపోయానని వెళ్లిపోయిన అభ్యర్థిని వెనక్కి పిలిపించి రీకౌంటింగ్‌కు డిమాండు చేయించారు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాల్ని ధిక్కరించడమే. ప్రజల తీర్పును అమలుచేయాల్సిన కలెక్టర్, ఎస్పీలు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేశారు. తెదేపా అభ్యర్థి రామగోపాల్‌రెడ్డిని లాక్కెళ్లి అరెస్టు చేశారు’ అని మండిపడ్డారు.
అధికారులూ.. అభివృద్ధిలో భాగస్వాములవండి, జగన్‌రెడ్డి నేరాల్లో కాదు
‘జగన్‌రెడ్డి అనుసరించే థియరీ ఒకటుంది. మామూలు వ్యక్తులతో మొదట చిన్నతప్పు చేయించి, అతన్ని కాపాడతారు. తర్వాత మరో పెద్ద నేరం చేయిస్తారు. ఆ వ్యక్తి జైలుకు పోతే, అతని కుటుంబాన్ని కాపాడతారు. ఒక ఊరిని రెండు వర్గాలుగా విడదీస్తారు. పెద్ద వర్గం ఆయనతో ఉంటుంది. తర్వాత రెండోవర్గాన్నీ లొంగదీసుకుంటారు. అలా మొత్తం ఆ ప్రాంతాన్నీ, అక్కడి ప్రజల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేస్తారు. దేశచరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడూ చేయనివిధంగా పారిశ్రామికవేత్తల్ని, ఐఏఎస్ అధికారులనూ తనతో జైలుకు తీసుకెళ్లిన ఘనత జగన్‌ది. జగన్ అహంకారి అయినా పర్వాలేదు గానీ ఆయనో సైకో. అవతలివాళ్లను బాధపెట్టి చూసి ఆనందపడటం ఆయన తత్వం’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రామగోపాల్‌రెడ్డి గెలుపును అంగీకరించలేవా జగన్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నడూ లేని సవాళ్లను చూశామని చంద్రబాబు తెలిపారు. ‘నిద్రలేని రాత్రులు గడిపాం. వాళ్ల అరాచకాలకు శనివారం రాత్రంతా మేలుకునే ఉన్నాను. ఏం జగన్... ఓటమిని అంగీకరించవా? నీ పులివెందుల కూడా పశ్చిమ రాయలసీమలో ఉంది. అక్కడ మీ పార్టీ ఓడిపోయింది. రామగోపాల్‌రెడ్డి గెలిచారు. దాన్ని అంగీకరించవా? రేపటి నుంచి శాసనమండలిలో రామగోపాల్‌రెడ్డి ముఖం చూడాలి కదా? ఎక్కడికి పోతావు? జగన్ ఒక్క పులివెందుల ప్రజల ఓట్లతోనే గెలిచారు. రామగోపాల్‌రెడ్డిని మూడు జిల్లాల ఓటర్లు గెలిపించారు. అలాంటి వ్యక్తిని లాక్కెళతారా? అంత అహంకారమా? ఆ అహంకారమే మీ పతనానికి నాంది అని గుర్తుపెట్టుకోండి’ అని చంద్రబాబు హెచ్చరించారు.
వైకాపా కాదు... వైఛీపో అంటున్నారు
ప్రజలు జగన్ పార్టీని వైకాపా కాదు... వై ఛీ పో అంటున్నారని, అయినా వారికి సిగ్గులేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘స£జ్జల రామకృష్ణారెడ్డి ఓటర్లను అవమానించేలా మాట్లాడారు. తెదేపాకి ఒక వర్గమే ఓట్లు వేసిందని, వారికి తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని అంగీకరించారు. మీరు ఏదో చేశామని చెబుతున్న జనం కూడా ఫ్యాన్ పని అయిపోయిందనే అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వారికి రూ.10 ఇచ్చి, రూ.100 లాక్కుంటోంది. జంగారెడ్డిగూడెంలో ఫ్యాన్ పనిచేయట్లేదని పిల్లలు దాన్ని తీసేసి, తుక్కు కింద పడేస్తే... పోలీసులకు అప్పగించి, వారిని కొట్టి, ఇతర ఖైదీలతో పాటు పెట్టారు. వారితో మరుగుదొడ్లు కడిగించాలని చూశారు. పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడమే నేరం. అలాంటి పోలీసులు ఎలా కొడతారు?’ అని చంద్రబాబు మండిపడ్డారు. పిల్లల్ని వేధించిన హెడ్మాస్టర్ని, పోలీసుల్ని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని, జరిగిన ఘటనపై చైల్డ్ ప్రొటెక్షన్ సెల్, జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
మీ అరాచకాల్ని రాస్తే.. జైల్లో పెడతారా?
ప్రతిపక్షాలపైనా, కొన్ని పత్రికలపైనా జగన్ పదేపదే చేస్తున్న విమర్శల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ... ‘జగన్ అరాచకాల్ని రాస్తే జైల్లో పెడతారా? మీకూ సాక్షి పత్రిక, పరిశ్రమలూ ఉన్నాయి కదా? అప్పట్లో మేం తలుచుకుంటే వాటిపై చర్యలు తీసుకోలేమా? కానీ మాకు సంస్కారం అడ్డొచ్చింది. కొందరు ఆరేడు దశాబ్దాలుగా బ్రాండ్‌ని, విశ్వసనీయతనీ నిరూపించుకున్నారు. ప్రజల ప్రయోజనాలే తమ పరమావధి అని చిత్తశుద్ధి చాటుకున్నారు. ప్రజలకు విశ్వాసంగా ఉన్న ఏ సంస్థయినా మనుగడ సాగిస్తుంది. అది వ్యాపారసంస్థ కావొచ్చు, మీడియా కావొచ్చు, రాజకీయ పార్టీ కావొచ్చు. విశ్వాసఘాతకులు గాలికి కొట్టుకుపోతారు. తమపని తాము చేసుకుంటూ గౌరవంగా బతికేవాళ్లనూ జగన్ రోడ్డుకీడ్చారు. వారిగురించి రోజూ బజారులో మాట్లాడుతున్నారు. మీడియా, మేధావులు జగన్‌కు ఊడిగం చేయాలా? కొందరు పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా... వాళ్లతో చేయించుకోండి’ అని ధ్వజమెత్తారు.
లోకేశ్‌ను పంపేసి... సుబ్బారెడ్డిని ఎందుకు తిరగనిచ్చారు?
‘ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రీఫైనల్, సెమీఫైనల్ అని, విశాఖ రాజధానికి రెఫరెండం అని, ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాకు ఓట్లు వేయకపోతే రాజధానికి ద్రోహం చేసినట్టవుతుందని... వైకాపా నాయకులు చాలా మాట్లాడారు. కానీ ప్రజలు మీ డ్రామాలన్నీ తెలుసని, బాగా కాల్చి వాతపెట్టారు. రాజధాని అంశం కోర్టులో ఉంటే... ముఖ్యమంత్రి రేపు విశాఖకు వెళతాను, ఎల్లుండి వెళతానంటూ కోర్టుధిక్కారానికి పాల్పడ్డారు. వారి బాగోతాలన్నీ ప్రజలు గ్రహించారు కాబట్టే ఓట్లు వేయలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్... ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టెంట్‌లోనే ఉంటానని, కావాలంటే ఫోన్లు కూడా తీసుకోవాలని చెప్పినా వినకుండా... ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల పరిధిలో ఉండకూడదని బయటకు పంపేశారు. మరి వైకాపా నేత సుబ్బారెడ్డి విశాఖ ఎలా వెళ్లారు? పోలింగ్ రోజూ ఆయన ప్రచారం చేశారు కదా? మేం ఆయనను పట్టించేవరకు పోలీసులు ఏం చేశారు?’ అని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా డబ్బులిచ్చి ఓటర్లను మభ్యపెట్టడం, అర్హత లేకపోయినా ప్రైవేటు ఉపాధ్యాయులను ఓటర్లుగా చేర్చడం, రాయలసీమకు ఒక అధికారిని పంపించి బెదిరింపులకు పాల్పడటం వంటివి పనిచేయడం వల్లే వైకాపా అభ్యర్థులు గెలిచారని చంద్రబాబు పేర్కొన్నారు.
రెండో ప్రాధాన్య ఓటు వేసినవారికి కృతజ్ఞతలు
ముందుగా కుదుర్చుకున్న అవగాహన ప్రకారం... పీడీఎఫ్ అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తెదేపాకు పడేలా చేసినందుకు సీపీఎం, సీపీఐలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాజపా, స్వతంత్ర అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లలోనూ అత్యధికం తెదేపాకే వచ్చాయని తెలిపారు. ‘ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. రెండో ప్రాధాన్య ఓట్లు మాకు వేసి బలపర్చిన రాజకీయపార్టీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది: గంటా శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఉత్తరాంధ్ర ఉతికారేసింది, తూర్పు రాయలసీమ తుక్కు రేగ్గొట్టింది. పశ్చిమ రాయలసీమ పడుకోబెట్టింది. ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. జై తెలుగుదేశం. సైకో పోవాలి సైకిల్ రావాలి’’ అని ఆదివారం ట్వీట్ చేశారు.
సీఎం చెప్పిన 86 శాతం కుటుంబాల వల్లే గెలుపు: బీటెక్ రవి
వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలోని 86 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని సజ్జల గుర్తుచేసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాల్లోని వారే ఈ ఎన్నికల్లో తెదేపాను గెలిపించారని పేర్కొన్నారు. వివేకా హత్యపై వైకాపా వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయని, పశ్చిమ రాయలసీమలో తెదేపా గెలుపునకు అదీ ఓ కారణమని ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!