CM Jagan: ఒంటరిగా పోటీచేసే దమ్ముందా?

‘నా ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే.. వాళ్లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాళ్లకు సవాలు విసురుతున్నా... ఎన్నికల బరిలో 175 స్థానాల్లో ముఖాముఖిగా ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం.. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఉన్నాయా?

Updated : 20 Mar 2023 06:50 IST

వీళ్లలా పొత్తులు పెట్టుకునేందుకు నేను వెంపర్లాడను
రెండేళ్లలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు
తిరువూరు సభలో ముఖ్యమంత్రి జగన్‌
విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లోకి రూ.698.68 కోట్లు
ఈనాడు - అమరావతి

‘నా ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే.. వాళ్లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాళ్లకు సవాలు విసురుతున్నా... ఎన్నికల బరిలో 175 స్థానాల్లో ముఖాముఖిగా ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం.. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఉన్నాయా? వీళ్లలా పొత్తులు పెట్టుకునేందుకు నేను వెంపర్లాడను. నేను నమ్ముకున్నది ఆ దేవుడిని, ప్రజలనే. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి మంచే గెలుస్తుంది. రామాయణం, భారతం, బైబిల్‌, ఖురాన్‌ ఏది చూసినా ఇదే కనిపిస్తుంది. ఏ సినిమాకు వెళ్లినా.. హీరోనే నచ్చుతాడు కానీ.. విలన్లు నచ్చరు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకూ తాను బటన్‌ నొక్కి రూ.1.98 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వేశానని తెలిపారు. పేదలకు తాను మంచి చేయడాన్ని కొందరు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ‘గత ప్రభుత్వంలో ఇదే బడ్జెట్‌ ఉండేది. వాళ్లు అప్పట్లో చేయలేకపోయింది, ఇప్పుడు నేను ఎలా చేయగలుగుతున్నానో ఆలోచించండి. అప్పుల పెరుగుదల శాతం కూడా అప్పటికంటే ఇప్పుడే తక్కువ. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనే పద్ధతి ఉండేది. ఇప్పుడు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పంథాలో నేను పాలన సాగిస్తున్నాను’ అని చెప్పారు.

చదువుతోనే పేదరికం దూరం

‘పేదరికం నుంచి బయటపడడం చదువుతోనే సాధ్యం. కుటుంబాల నుంచి దేశాల వరకు తలరాతలు మార్చే శక్తి విద్యకే ఉంది. పేదరికం వల్ల చదువులు మానేసే పరిస్థితి ఏ విద్యార్థికీ ఉండకూడదనే విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి ఫీజును చెల్లిస్తున్నాం’ అన్నారు. మూడు నెలలకోసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే విద్యాదీవెన నిధులు వేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే తిరువూరు వేదికగా    9.86లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో    రూ.698.68 కోట్లను ఆదివారం బటన్‌ నొక్కి ఒకేసారి వేసినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక గత  45 నెలల్లో విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.13,311 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లో వేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగానే ఉండేదన్నారు. అదికూడా ఏళ్ల తరబడి బకాయిలు ఉంచేవారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆఖరి రెండేళ్లు చెల్లించకుండా వదిలేసిన బకాయిలను సైతం తాము చెల్లించామని ముఖ్యమంత్రి తెలిపారు.

మరో రెండేళ్ల సమయం ఇవ్వండి..

మరో రెండేళ్ల సమయం తనకు ఇస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేస్తానని జగన్‌ అన్నారు. ‘నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి ప్రభుత్వ బడులు..కార్పొరేట్‌తో పోటీపడలేవు అన్న మాటను తుడిచేస్తా. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదీ డిజిటలైజ్‌ కాబోతోంది. ఒకసారి ప్రభుత్వ బడి డిజిటలైజ్‌ అయితే.. కార్పొరేట్‌ పాఠశాలలే వాటితో పోటీపడే పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యలోనూ విపరీతమైన మార్పులు తీసుకొచ్చాం. మూడేళ్ల కోర్సులను నాలుగేళ్లు చేశాం. ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశాం, ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తున్నాం. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకుని ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం’ అని జగన్‌ తెలిపారు. వైద్య విద్యా రంగంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు