సంక్షిప్త వార్తలు(3)

దేశంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నిధుల కేటాయింపు, చట్టసభల్లో రిజర్వేషన్లు, జనగణన తదితర డిమాండ్లపై జాతీయస్థాయిలో వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.

Updated : 20 Mar 2023 06:49 IST

బీసీ డిమాండ్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి

మంత్రి కిషన్‌రెడ్డికి జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నిధుల కేటాయింపు, చట్టసభల్లో రిజర్వేషన్లు, జనగణన తదితర డిమాండ్లపై జాతీయస్థాయిలో వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఆదివారం ఆయనతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌, మణిమంజరి, లింగం, రాజు, భాస్కర్‌ తదితరులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.


రాహుల్‌ని వేధించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం
పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఏదో ఒక కారణంతో వేధించటమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భారత్‌ జోడో యాత్రలో చేసిన వ్యాఖ్యలపై దిల్లీ పోలీసులు 45 రోజుల తర్వాత సమాచారం అడగటం హాస్యాస్పదమని పేర్కొంటూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొంత మంది మహిళలు ఇప్పటికీ తమపై లైంగిక దాడులు జరుగుతున్నాయని చెప్పినట్లు రాహుల్‌ గతంలో వ్యాఖ్యానించగా.. ఆ మహిళల వివరాలు ఇవ్వాలని దిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారన్నారు. ఆయన ప్రతిష్ఠను, మనోధైర్యాన్ని ఈ చర్యలు ఏ మాత్రం దెబ్బతీయలేవని రుద్రరాజు స్పష్టం చేశారు.


ఆందోళనలు చేస్తే కానీ వేతనాలు చెల్లించరా?
సీఆర్‌డీఏ పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితిపై తెదేపా

ఈనాడు-అమరావతి: సీఆర్‌డీఏ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడంలేదని తెదేపా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏలూరు సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభలో ఆదివారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ఆందోళనలు చేస్తే కానీ వేతనాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలనూ వీరికి కల్పించడం లేదన్నారు. వీరికి నెలకు రూ.12 వేలను మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ గత డిసెంబరు వరకు వేతనాలు చెల్లించామన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అంశాలు ప్రైవేట్‌ సంస్థ పరిధిలో ఉన్నాయని కొత్త సంస్థ ఎంపిక త్వరలో జరుగుతుందని తెలిపారు. కార్మికులకు నెలకు వేతనం రూ.21 వేలు ఇస్తున్నామన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు