సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదు: రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 20 Mar 2023 07:26 IST

 లీకేజీ కేసు సీబీఐకి అప్పగించాలి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, గాంధారి: రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం నిరుద్యోగ నిరసన దీక్ష శిబిరం, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 నుంచి ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిట్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సీబీఐకి అప్పగించాలని కోరారు. సీబీఐపై ప్రభుత్వానికి నమ్మకం లేకుంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై విద్యార్థి విభాగం ఆధ్యర్యంలో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశామని వెల్లడించారు. దిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను తీసుకొచ్చి వాదించనున్నామన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలుస్తుందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వెనక ఉన్న బడా వ్యక్తుల పేర్లు చెబితే ఎన్‌కౌంటర్‌ చేస్తామంటూ చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను కొందరు బెదిరించారని ఆరోపించారు. ఈ నెల 13నుంచి 18వరకు జైలు సందర్శకుల వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

పైరవీతో ఉద్యోగం.. పదోన్నతి

టీఎస్‌పీఎస్సీలో విధులు నిర్వహించే 20మందిని నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్‌-1 పరీక్షలు రాయడానికి కమిషన్‌ అనుమతించిందని ఆరోపించారు. అందుకు బాధ్యులెవరో వెల్లడించాలన్నారు. 2016లోజరిగిన గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలో సైతం అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయన్నారు. లీకేజీ కేసులో ఏ-2గా పేర్కొన్న రాజశేఖర్‌కు ఓ ప్రజాప్రతినిధి పీఏ పైరవీతోనే 2017లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం వచ్చిందన్నారు. ఆ పీఏ ప్రోద్బలంతోనే రాజశేఖర్‌కు పదోన్నతిఇచ్చి.. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో సహాయ సెక్షన్‌ అధికారిగా బాధ్యతలు అప్పగించారన్నారు. ఇందులో సెక్షన్‌ అధికారి పాత్ర ఏమిటో వెల్లడించాలని డిమాండ్‌చేశారు. ఆ పీఏ, రాజశేఖర్‌ స్నేహితులని, వారు జగిత్యాలజిల్లా మల్యాల మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందినవారని రేవంత్‌ తెలిపారు. దీక్షలో షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, సీతక్క, సుదర్శన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌ షెట్కార్‌, మహేష్‌కుమార్‌గౌడ్‌, బలరాంనాయక్‌, వేంనరేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్‌రావు, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, గంగారాం తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు