తెలంగాణలో దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా కుట్ర

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, దేశానికి భాజపా ప్రమాదకారి అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు.

Published : 20 Mar 2023 04:27 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు

సూర్యాపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, దేశానికి భాజపా ప్రమాదకారి అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. సూర్యాపేట మండలం రాయినిగూడెంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు ఫెడరలిజాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను అణిచి వేయాలనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను సంస్థలతో కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అవినీతి జరుగుతుంటే ఆ దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాఘవులు డిమాండ్‌ చేశారు. ఇందులో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు