Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమే.. 2024లో పూర్తి సినిమా: నారా లోకేశ్‌

‘నాడు సీఎం జగన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి తన వెంట్రుక కూడా పీకలేరన్నారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా గుండు కొట్టారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 20 Mar 2023 09:14 IST

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘నాడు సీఎం జగన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి తన వెంట్రుక కూడా పీకలేరన్నారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా గుండు కొట్టారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. 47వ రోజు యువగళం పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం చిన్నపల్లెవాండ్లపల్లిలో ప్రారంభమైంది. రాత్నాలపల్లి వద్ద 600 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా చిన్నయల్లంపల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జోగన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న జగన్‌కు మూడు ప్రాంతాల ప్రజలూ మూడు మొట్టికాయలు వేశారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమేనని.. 2024లో వైకాపాకు పూర్తి సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తుంటే సీఎం జగన్‌ కనీసం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాసెసింగ్‌ యూనిట్లేవీ?

ఎన్నికల ముందు టమోటా, వేరుసెనగ రైతుల కోసం ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లయినా వాటి ఊసే ఎత్తడం లేదని లోకేశ్‌ విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలు, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక నంద్యాల జిల్లాకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని గుర్తుచేశారు. వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ 200 వారాలైనా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. రెండుసార్లు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని, దానికోసం సొంత మీడియా సంస్థకు రూ.30 కోట్లు ప్రకటనలు ఇచ్చారని.. పరిశ్రమకు మాత్రం పైసా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని