ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే

రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 20 Mar 2023 05:02 IST

టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రాష్ట్రం సహకరించాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
వచ్చే నెలలో రాష్ట్రానికి   ప్రధాని వస్తున్నారని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు సైతం విశ్వసిస్తున్నారని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి గెలుపే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు భాజపా చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ సమాజం సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రజలు చూపుతున్న విశ్వాసంతో పూర్తి ఆత్మస్థైర్యంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ముందుకు వెళ్తుందని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. అబద్ధాలు, అధికార దుర్వినియోగం, డబ్బులు, మద్యం ద్వారా గెలుస్తామనే ధోరణిని కల్వకుంట్ల కుటుంబం కనబరుస్తోంది. ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం అంగీకరించదని ఈ ఎన్నిక ద్వారా రుజువైంది. మునుగోడులోనూ నిజమైన గెలుపు భాజపాది, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిదే. ప్రపంచం అంతా భారత్‌ వైపు చూస్తుంటే, సీఎం కేసీఆర్‌ మాత్రం ఆయన కుటుంబం వైపు చూస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే భాజపాపై ఆరోపణలు చేస్తున్నారు. మద్యం కేసు నుంచి దృష్టి మళ్లించడానికి మహిళా బిల్లుపై పోరాటం చేస్తున్న భారాసకు.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పనుల శంకుస్థాపనకు మోదీ..

వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారు. రూ.720 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు, జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.10 వేల కోట్లతో మంచిర్యాల- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిని నిర్మిస్తున్నాం. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు త్వరలో ప్రారంభమవుతుంది.

పీఎం మిత్ర మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్కును రాష్ట్రానికి మంజూరు చేసినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో చేనేత రంగానికి, రాష్ట్రాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. టెక్స్‌టైల్‌ పార్కు అంశంలో రాజకీయాల జోలికి పోకుండా.. ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదం బాధ కలిగించింది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. సమావేశంలో నేతలు బూర నర్సయ్యగౌడ్‌, ప్రకాశ్‌రెడ్డి, సంగప్ప, సుభాష్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని