Botsa: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చిన్నది: మంత్రి బొత్స

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చిన్నదని, అందులో ఓటమికి విశాఖ రాజధానికీ సంబంధమేంటని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Updated : 20 Mar 2023 08:21 IST

దానికీ విశాఖ రాజధానికి సంబంధమేంటి?

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చిన్నదని, అందులో ఓటమికి విశాఖ రాజధానికీ సంబంధమేంటని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 108 నియోజకవర్గాల ఎన్నికని తెదేపా నేతలు అంటున్నట్లు విలేకరులు ప్రస్తావించగా... ‘ఆ నియోజకవర్గాల్లో నుంచి ఈ ఎన్నికల్లో ఓట్లేసినవారు ఒక్క శాతమే. అయినా దీన్ని మేం తేలిగ్గా తీసుకోలేదు. వారిలోనైనా అసంతృప్తి ఎందుకు వచ్చిందో.. సమన్వయలోపం ఎక్కడ ఉందో బేరీజు వేసుకుని సమస్యను అధిగమిస్తాం’ అని చెప్పారు. సచివాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గతంలో నేను పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫోక్స్‌వ్యాగన్‌ కుంభకోణం జరిగిందంటూ.. లేని విషయాల్ని ప్రచారం చేశారు. అప్పుడు మేం స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరాం. తెదేపా హయాంలో సీమెన్స్‌ కుంభకోణంలో చంద్రబాబు అండ్‌ కో దోపిడీకి పాల్పడ్డారు. రూ.300 కోట్లు దోపిడీ జరిగిందని ఆరోజే ప్రభుత్వాన్ని ఈడీ హెచ్చరించినా పట్టించుకోలేదు. తప్పుచేశారు కాబట్టే చంద్రబాబు కోర్టుముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీమెన్స్‌ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని నిరూపిస్తాం. ఆయనకు శిక్ష తప్పదు. నాలుగు వ్యవస్థలు పనిచేయట్లేదని తెదేపా నేతలు అంటున్నారు. పక్షులు తిరగట్లేదా? గాలి వీయడం లేదా? వెలుతురు రావట్లేదా? చీకటి పడట్లేదా? ఏ నాలుగు వ్యవస్థలు పనిచేయట్లేదు? చంద్రబాబు హయాంలో సక్రమంగా, ఇప్పుడు అక్రమంగా జరుగుతున్నవేంటి?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు