భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం కోరలేదు

భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని తాను ఏ దేశాన్నీ ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

Published : 20 Mar 2023 04:10 IST

ఏ దేశాన్నీ ఆహ్వానించలేదు
బ్రిటన్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ వివరణ

దిల్లీ: భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని తాను ఏ దేశాన్నీ ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఇది భారత అంతర్గత విషయమని.. దీన్ని అధికారంలో ఉన్న పార్టీయే పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు. లండన్‌లో తన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. తొలుత జీ20 అధ్యక్షతపై ప్రభుత్వ ప్రణాళికలను కమిటీకి జైశంకర్‌ వివరించారు. అది పూర్తయిన తర్వాత ఓ ఎంపీ మాట్లాడుతూ.. కొంత మంది మన దేశ ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై అవమానిస్తున్నారని అన్నట్లు తెలిసింది. దీనికి స్పందిస్తూ రాహుల్‌ సుదీర్ఘంగా తన వాదనను కమిటీ ముందుంచినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రాహుల్‌ వివరణ ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదని కొంతమంది భాజపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే అధికార పార్టీ ఎంపీలే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు.. దానిపై వివరణ ఇచ్చే హక్కు ప్యానెల్‌ సభ్యుడికి ఉంటుందంటూ విపక్ష ఎంపీలు రాహుల్‌కు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలో సభ్యులను నిలువరించిన జైశంకర్‌ కేవలం సమావేశ ఎజెండాపైనే మాట్లాడాలని కోరారని తెలిసింది. ఈ విషయంపై ఏదైనా స్పష్టతనివ్వాలంటే.. పార్లమెంటులోనే మాట్లాడాలని సూచించారని తెలుస్తోంది. భాజపా ఆరోపించినట్లుగా తాను దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ గాంధీ సమావేశంలో అన్నట్లు తెలిసింది. భాజపా ఎంపీల వ్యాఖ్యలపై ఆయన గట్టిగానే స్పందించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని