జగన్‌ పాలనలో రూ.57 వేల కోట్ల విద్యుత్తు భారం

ఈ నాలుగేళ్ల వైకాపా పాలనలో ప్రజలపై రూ.57 వేల కోట్ల విద్యుత్తు భారాన్ని మోపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్తు రంగం కుప్పకూలిందని మండిపడ్డారు.

Updated : 20 Mar 2023 06:20 IST

అసెంబ్లీ వరకు తెదేపా నేతల   నిరసన ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ నాలుగేళ్ల వైకాపా పాలనలో ప్రజలపై రూ.57 వేల కోట్ల విద్యుత్తు భారాన్ని మోపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్తు రంగం కుప్పకూలిందని మండిపడ్డారు. ‘విద్యుత్‌ బాదుడు రూ.57 వేల కోట్లు’ అని ఉన్న బ్యానర్‌తో అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ‘మోటార్లకు మీటర్లు.. రైతుల మెడకు ఉరితాళ్లు’ అని ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే రాష్ట్రంలో పవర్‌ హాలిడేలు వచ్చాయని విమర్శించారు. ‘తెదేపా హయాంలో అయిదేళ్లలో ఒక్క రూపాయి ఛార్జీ కూడా పెంచలేదు. ఈ ప్రభుత్వం ట్రూఅప్‌ ఛార్జీలు, పాత బకాయిల పేరుతో దేశంలో ఎక్కడా లేనివిధంగా సామాన్యులపై భారం మోపింది. పశ్చిమ రాయలసీమ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్ని చూస్తే కొందరు అధికారులు ప్రభుత్వం చేతుల్లో ఎంతలా కీలుబొమ్మలుగా మారారో అర్థమవుతోంది’ అని మండిపడ్డారు.


బేడ, బుడగ, జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వరా?
తెదేపా శాసనసభాపక్ష ఉపనేత   నిమ్మల రామానాయుడు నిరసన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బేడ, బుడగ, జంగం సామాజికవర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వారు నష్టపోతున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఈ డిమాండుతో కూడిన ప్లకార్డును పట్టుకొని తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం గంటపాటు నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘బేడ, బుడగ, జంగాలకు తెలంగాణలో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నా... రాష్ట్రంలో ఇవ్వట్లేదు. తెదేపా ప్రభుత్వహయాంలో ఆ సామాజికవర్గ స్థితిగతులపై జేసీ శర్మ కమిషన్‌ వేశారు. వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పట్లో క్యాబినెట్‌ ఆమోదించి, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ అంశం గురించి పట్టించుకోలేదు’ అని రామానాయుడు పేర్కొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు